తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేబినెట్ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్ష నియామకం తాత్కాలికంగా వాయిదా వేశారు. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, మంత్రివర్గంలో చోటు కల్పించే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం కారణంగా కేబినెట్ విస్తరణ, పీసీసీ నియామకం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వారం పది రోజుల తర్వాత మరోసారి దీనిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర కేబినెట్‌లో ఖాళీలు పూరించడం, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై గడిచిన వారం, పది రోజులుగా ముమ్మర కసరత్తు జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి వారం కిందట కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశాలపై చర్చలు జరిపారు. అధిష్టానం సైతం ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది. తాజాగా నిన్న కూడా ఈ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి మరోసారి ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, కేసీలతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చలు కొనసాగాయి. మంత్రివర్గంలోకి తీసుకునేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నవారి పేర్లను మరోమారు పరిశీలించారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేంసాగర్‌రావు, వివేక్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో వాకిటి శ్రీహరి పేరుపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ మిగతా పేర్ల విషయంలో పీఠముడి నెలకొంది.
నిన్నటి భేటీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించినా, దీన్ని సైతం అధిష్టానం పెద్దలు తేల్చలేకపోయారు. అధ్యక్ష పదవిని సీనియర్ నేతలు మహేశ్, మధుయాష్కీలలో ఒకరికి కట్టబెట్టాలనే ఆలోచన చేసిప్పటికీ సమీకరణలు కుదరని దృష్ట్యా, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సంపత్‌కుమార్, బలరాం నాయక్‌ల పేర్లు కూడా మరోమారు చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణలు, మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావించి నట్లు తెలిసింది. ఇక కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయ్యాకే ఇతర పదవుల భర్తీ అంశంపై హైకమాండ్ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.