స్వతంత్ర, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ అంటే నటనకు ప్రతిరూపం.. గ్రంథాలయమని టీడీపీ నాయకుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మహత్తర ఆశయాలు కలిగినవారే మహానుభావులు అవుతారని.. అలాగే మన తెలుగు జాతికి మహానుభావుడు ఎన్టీఆర్ పుట్టారని అన్నారు. ‘ఎన్టీఆర్ శతజయంతి’ సందర్భంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలియజేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం అని అన్నారు. ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఎన్టీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. నటనలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని అభివర్ణించారు. తెలుగువాడినని గర్వంగా చెప్పుకునేందుకు ధైర్యం ఇచ్చింది ఎన్టీఆర్ అని కొనియాడారు. అయన బిడ్డగా జన్మించినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలియజేశారు.