Balagam Mogulaiah| ఇటీవల మంచి విజయం సాధించిన బలగం(Balagam)సినిమాతో గుర్తింపు పొందిన మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా క్లైమాక్స్ లో బుడగజంగాల కళాకారులు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించింది. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన మొగిలయ్య దంపతులు ఊరురా తిరుగుతూ బుర్రకథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. వీరి ప్రతిభ గుర్తించిన బలగం చిత్ర దర్శకుడు వేణు బలగం చిత్రంలో అవకాశం ఇచ్చాడు.
అయితే కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడైపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న మొగిలయ్య వరంగల్ సంరక్ష ఆసుప్రతిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో డయాలసిస్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. తన భర్తకు వైద్యసాయం అందించి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని చేతులు జోడించి వేడుకుంటోంది.