విమానయాన భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. బెదిరింపులకు పాల్పడేవారిని నో ఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన బెదిరింపులు మొత్తం బూటకమని తేలిందన్నారు. పౌర విమానయాన శాఖకు కఠినమైన ప్రోటోకాల్ ఉందన్న రామ్మోహన్‌నాయుడు.. దానినే తమ శాఖ, విమానయాన సంస్థలు అనుసరిస్తోందని వివరించారు. బెదిరింపు కాల్స్, సోషల్ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానంలో బోర్డింగ్ అయ్యాక బెదిరింపులకు పాల్పడే వారికి శిక్ష విధించేలా చట్టంలో ఇప్పటికే సెక్షన్లు ఉన్నాయన్నారు. కానీ ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెదిరింపులకు పాల్పడేవారికి కూడా వీటిని వర్తింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.