స్వతంత్ర వెబ్ డెస్క్: టెస్టు క్రికెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో మరోసారి భారత్ నిరాశపరిచింది. ఇంగ్లాండులోని ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచులో తడబాటుకు గురై 209 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీ భారత్‌కు కలగానే మిగిలిపోయింది. అయితే ముందునుంచి దూకుడుగా ప్రదర్శించిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలిచింది. 209 పరుగుల తేడాతో విక్టరీ అందుకున్న ఆసీస్.. డబ్ల్యూటీసీ టైటిల్ గెలుపొందిన రెండో జట్టుగా రికార్డులకెక్కింది. అయితే నాలుగో రోజు ఆశలు రేపిన టీమిండియా.. ఐదో రోజు కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఐదో రోజు తొలి సెషన్ లో 63.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. చివరి రోజు టీమిండియా గెలువాలంటే 280 పరుగులు కావాలి. అందుకు ఆస్ట్రేలియా గెలువాలంటే 7 వికెట్లు పడగొట్టాలి. బ్యాటింగ్, బౌలింగ్ బలాబలాల్లో గెలుపు ఆసీస్ నే వరించింది. 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. మరోవైపు తొలి సెషన్లోనే భారత బ్యాటర్లు విఫలమవ్వడం గమనార్హం. ఆసీస్ నిర్దేశించిన 444 పరుగుల ఛేదనలో 164/3తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమ్ ఇండియా.. ఆసీస్ బౌలింగ్ ధాటికి నిలువలేకపోయింది. తొలి సెషన్‌లో మరో 70 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. రికార్డు ఛేజింగ్‌లో ఆశలు రేపిన కోహ్లీ, రహానె వికెట్లు పడిపోవడంతో.. టీమ్‌ఇండియా పతనం ప్రారంభమైంది.
డబ్ల్యూటీసీ విజేతగా నిలవడంతో ఆస్ట్రేలియా ఐసీసీ ట్రోఫీల్లో చరిత్ర సృష్టించింది. అన్ని ఐసీసీ టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా ఆసీస్ నిలిచింది. వన్డే ప్రపంచకప్, టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆసీస్.. తాజాగా డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచి మొత్తం నాలుగు ఐసీసీ టైటిళ్లు సొంతం చేసుకున్న ఏకైక జట్టుగా అవతరించింది


