స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని (Andhra Pradesh) పుంగనూరు, అంగళ్లులో చోటుచేసుకున్న హింసాత్మక ఘటన కేసులు మరో మలుపు తిరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) అన్నమయ్య జిల్లాలో కేసు నమోదైంది. అంగల్లు లో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం చేశారని ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసును నమోదు చేశారు.
అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతోనే కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారని అభియోగాలు నమోదు చేశారు. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma), A3గా మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి(Amarnath Reddy), ఏ4గా రాంగోపాల్‌రెడ్డి(Ramgopal Reddy,), నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా మొత్తం 20 మందిని చేర్చారు.
“ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. తమాషాలు చేస్తున్నారా.. చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..” అంటూ చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. మరోవైపు పుంగనూరు ఘటనలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 74కు పెరిగింది. ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు ఇంకా పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. ఇక ఈ కేసుల్లో నిందితుల సంఖ్య 277కి చేరింది. సోమవారం రాత్రి కానిస్టేబుళ్లు రణధీర్, లోకేష్ ఇచ్చిన రెండు ఫిర్యాదుల ప్రకారం 117 మందిపై కేసులు నమోదు చేశారు. సోమవారం వరకు అరెస్టు చేసిన 71 మందిలో 13మందిని చిత్తూరు జైలుకు, 58 మందిని కడప జైలుకు తరలించారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.