అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద దాడికి యత్నించిన భారత సంతతి వ్యక్తికి తాజాగా జైలు శిక్ష పడింది. 2023లో భారత సంతతి యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడైన తెలుగు సంతతి వ్యక్తి 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ వెల్లడించారు. నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువకుడు యత్నించాడని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నాజీ భావజాలంతో కూలగొట్టాలనే ఉద్దేశంతో సాయివర్షిత్ ఈ దాడికి యత్నించాడని కోర్టు తెలిపింది. అవసరమైతే అధ్యక్షుడిని కూడా చంపాలని తాను నిర్ణయించుకున్నట్లు అంగీకరించాడని చెప్పింది. దీంతో అతడికి 8ఏళ్లు శిక్ష విధించాలని న్యాయస్థానం నిర్ణయించిందని తీర్పు వెల్లడించింది. అతడి చర్యల వల్ల ధ్వంసమైన నిర్మాణాల తొలగింపు, పునర్నిర్మాణం మొదలైన ఖర్చులతో కలిపి నేషనల్ పార్క్ సర్వీస్‌కు USD 4,322 డాలర్ల (సుమారు రూ.3,74,000) నష్టం వాటిల్లిందని కోర్టు పేర్కొంది.
కోర్టు పత్రాల ప్రకారం.. 2023 మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకొని రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్ వద్దకు వెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపాడు. పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం శ్వేతసౌధం ఉత్తరభాగం వైపు భద్రత కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకుదిగి నాజీ జెండాను పట్టుకొని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అధ్యక్షుడు జో బైడెన్‌ను హత్య చేయాలనే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం అతడు ఆరు నెలలుగా ప్లాన్ చేసి మరీ ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. ఈ విషయాన్ని సాయివర్షిత్ విచారణలో అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వర్గాలు మీడియాకు తెలిపాయి. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.