స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రభుత్వాస్పత్రిలో సిజేరియన్(Cesarean ) శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళ కడుపులో కత్తెర ఉంచి కుట్లు వేసిన ఘటనలో ఏలూరులో(Eluru) వెలుగు చూసింది. వారం రోజుల క్రితం మహిళకు శస్త్ర చికిత్స జరగ్గా, డిశ్చార్జి తర్వాత కూడా కడుపు నొప్పి తగ్గకపోవడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో ఆమెకు ఎక్స్‌రే(X-ray) తీయడంతో కడుపులో కత్తెర ఉన్న సంగతి బయటపడింది.
ఏలూరు సర్వజనాసుపత్రి వైద్యుల నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. కడుపులో కత్తెర మరిచి కుట్లు వేయడంతో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారం క్రితం కాన్పు కోసం ఓ గర్భిణీ మహిళ చేరింది.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమెకు సిజేరియన్ చేసి, పండంటి బిడ్డను బయటకు తీశారు.
శస్త్ర చికత్స తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు. అప్పటి నుంచి బాధితురాలు తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతోంది. తాజాగా వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం వెలుగు చూసింది. ఈ ఘటనను బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్త పడ్డారు. ఎక్స్‌రే ఫొటోను ఓ ఉద్యోగి తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది.
ఘటన వెలుగు చూడటంతో షాక్ తిన్న ఆస్పత్రి అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉద్యోగిని పిలిచి మందలించడంతో అతను ఆ పోస్టులను తొలగించాడు. మరోవైపు ఆస్పత్రి రికార్డుల్లో బాధితురాలి వివరాలు కూడా మాయం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు.. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే ప్రాణాల మీదకు తెచ్చారని మండిపడుతున్నారు.