స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మహానాడు వేదికగా సీఎం జగన్‌పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాజమహేంద్రవరంలో జరగుతున్న మహానాడులో ఆయన ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం గుప్పించారు. తనకు టీవీ లేదు, పేపర్ లేదు, బంగళా లేదు, తాను పేదవాడినని ప్రజలను మళ్లీ జగన్ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా అయినప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక ఇంటిని తాకట్టు పెట్టిన జగన్… ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అని విమర్శించారు.
చెన్నై, బెంగళూరు, ఇడుపలపాయ, పులివెందుల, లోటస్ పాండ్, అమరావతి ప్యాలెసులు ఎవరివో చెప్పాలని అచ్చెన్న సవాల్ విసిరారు. తాడేపల్లి ప్యాలెస్ డబ్బులతో నిండిపోయిందని దీంతో ఇప్పుడు ఆ డబ్బును ఇడుపులపాయకు తరలించి భూమిలో దాచిపెడుతున్నారని ఆరోపించారు. రూ.2వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించడంతో ఇప్పుడు వాటిని మార్చుకోలేక జగన్ తల్లడిల్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.