సర్పంచుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ గవర్నర్ రాధా కృష్ణను కలిసింది. జేఏసీ అధ్యక్షుడు సర్వీ యాదయ్య గౌడ్ , సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో 8మంది ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలిసి తమ సమస్యలను వివరిం చారు. సర్పంచుల కాలపరిమితి అయిపో యి ఆరు నెలలు గడుస్తున్నా సర్పంచుల సమస్యలపై, గ్రామ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని గవర్నర్‌కి తెలిపినట్లు జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ తెలిపారు. గవర్నర్ రాధాకృష్ణ స్పందించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తక్షణమే తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, గ్రామపంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తమ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి అభివృద్ధి చేసామని ఫోరమ్ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ రెడ్డి అన్నారు. తమకు రావలసిన బిల్లులపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడం లేదని పలుమార్లు కలెక్టర్లకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమ ఆస్తులు తాకట్టుపెట్టి గ్రామాలను అభివృద్ధి చేసామని, బిల్లుల రాక కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులతో సర్పంచులు సతమతమవుతున్నారని, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించాలని వేడుకున్నారు.