స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అస్సాం లేడీ సింగంగా పేరు గడించిన పోలీసాఫీసర్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇవాళ తెల్లవారుజామున వ్యక్తిగత పనిపై కారులో వెళ్తున్న ఆమె వాహనాన్ని ఓ కంటైనర్ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. కలియాబోర్ సబ్ డివిజన్ పరిధిలోని సరుభుగియా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. తీవ్ర గాయాలతో ఉన్న జున్మోనిని ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే జున్మోనిది హత్యానా? లేక ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేరస్తులపై ఉక్కుపాదం మోపడంతో పాటు తప్పు చేశాడని కాబోయే భర్తనే అరెస్ట్ చేసి లేడి సింగంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఓసారి ఆమె లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెషన్ కూడా ఎదుర్కున్నారు. ప్రస్తుతం జున్మోని మొరికొలాంగ్ పోలీస్ స్టేషన్ ఔట్ పోస్టు ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.