పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. నేతల పొలిటికల్ హైడ్రామాలు మహా నటులనే మించిపోతున్నాయి. జంపింగ్ జపాంగ్‌ల వ్యవహారంతో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతు న్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని టెన్షన్‌తో స్టేట్ పాలిటిక్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే వరంగల్‌లో ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహరం మంచి పొలిటికల్ మసాలాను జోడించడంతో ఒక్కసారిగా బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయ వేడి సెగలు కక్కింది.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రుచి చవిచూసిన బీఆర్‌ఎస్ పార్టీ వెంట కలిసి నడిచేందుకు గులాబీ నేతలు ఇష్టపడటం లేదు. అందుకే ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీని వీడి తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్, బీజేపీలకు జై కొడుతూ ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరిపోయారు. మరికొందరు అదే పనిలో బిజీగా మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. కేంద్రమంత్రి అమిత్‌షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకోవడం ఖామమన్న టాక్ ఊపందుకుంది. కానీ చివరిలో అంతా తారుమారై హైడ్రామా చోటు చేసుకుంది.
బీఆర్‌ఎస్‌పై అసంతృప్తిగా ఉన్న ఆరూరి రమేష్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించడం కోసం ప్రెస్ మీట్‌కు సిద్ధమయ్యారు. అయితే,.. విషయం తెలుసుకున్న గులాబీ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యతోపాటు పలువురు ఆరూరి నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ను వీడవద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆరూరిని కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గులాబీ, కమలనాథుల పరస్పర నినాదాల నడుమ ఆరూరీని బీఆర్‌ఎస్ నేతలు తమ వాహనంలో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆరూరిని తీసుకెళ్తుండగా కమలనాథులు అడ్డుకోవడంతో హనుమకొండలోనూ, జనగామ జిల్లా పెందుర్తిలోనూ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల తోపులాటలతో ఆరూరి రమేశ్ చొక్కా చిరిగిపోయింది. ఈ వ్యవహారంతో బీఆర్‌ఎస్ నాయకులపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. గుండాల్లా మారిన గులాబీ దళం ఆరూరిని కిడ్నాప్ చేశారంటూ విమర్శలు గుప్పించారు.
హైడ్రామా, ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు ఆరూరి రమేష్‌ను కేసీఆర్ నివాసానికి తీసుకెళ్లారు గులాబీ నేతలు. ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చిన ఆరూరి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని,.. అమిత్‌షాను కలిశానన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానన్న ఆయన.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. మా పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చానంటూ హైడ్రామాకు తెరదించారు. అయితే,.. పార్టీ మారనంటూ గులాబీ బాస్ ముందు చెప్పక తప్పలేదా..?, మునుముందు కూడా ఇదే మాట మీద కట్టుబడి ఉంటారా..? లేదంటే పక్క చూపులు చూస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


