జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లను అక్రమంగా అరెస్టు చేశారంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా?.. అంటూ ప్రశ్నించారు. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాలపైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు తమ ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా…అంటూ ఫైర్ అయ్యారు.
పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జిహెచ్ఎంసి అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును ఖండించిన హరీశ్‌రావు
జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగితే అరెస్టులు చేస్తారా?అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తున్న మీ వైఖరిని నిలదీస్తే మార్షల్స్ తో కార్పొరేటర్లను బడ్జెట్ కౌన్సిల్ నుంచి బయటికి పంపిస్తారా? అంటూ నిలదీశారు. బడ్జెట్ మీద ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదిస్తున్నట్లు ప్రకటించడం అప్రజాస్వామికమని అన్నారు. మీ నిరంకుశ వైఖరికి ఇది మరో నిదర్శనం. ప్రజల తరుపున ప్రశ్నించే ప్రజాప్రతినిధుల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదన్నారు హరీశ్‌రావు