G20 Summit: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరగబోయే జి–20 సదస్సు ద్వారా విశాఖ నగరానికి మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ మరింత పెంచేలా, దేశం గర్వించేలా ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో ఈ నెల 28 వ తేదీన ప్రారంభమయ్యే జి–20 సదస్సు ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, ఆదిమూలపు సురేష్ తో కలిసి ఆమె విశాఖపట్నంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ. జి–20 సదస్సుకు 40 దేశాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరగనున్న జి–20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.
కాగా జీ 20 సదస్సు కోసం విశాఖ మహానగరంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 130 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధానికి తగ్గట్లు అభివృద్ధి పనులు జరిగాయన్న మంత్రులు.. కొత్తగా 5 బీచ్‌లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంగళవానం సీఎం జగన్ జీ20 సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు జరిగే సదస్సుకు దేశ, విదేశాల నుంచి అతిథులు విశాఖ రాబోతున్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక సదస్సుకు వచ్చే వివిధ దేశాలకు చెందిన అతిథులకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అతిథుల రోజు వారి కార్యక్రమాలు, వారి పర్యటనకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లకు తగు చర్యలు చేపట్టారు. వారు బస చేయు హోటల్ వద్ద 24/7 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ లో రెవెన్యూ, జీవీఎంసీ, మెడికల్, పర్యాటకశాఖలకు సంబంధించిన సిబ్బందిని అందుబాటులో ఉండేలా 3 షిఫ్టులుగా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయంలోనూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.