ఆరోగ్యశ్రీ పేరుతో అక్రమాలు.. ఇదేంటని నిలదీస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులు.. వేలకువేలు దోచేస్తూ పేదలను జలగల్లా పట్టి పీడిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు. ఇదంతా అనంతపురం జిల్లా ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న అవినీతి బాగోతం. ఆ కథేంటో ఆ లెక్కలెంటో ఓసారి చూసే ద్దామా..?
పేద ప్రజల ప్రాణాలు నిలబెట్టడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన సుజాత ఫెషర్ సమస్యతో చికిత్స కోసం అనంతపురం లోని హర్షిత మల్టి స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫిబ్రవరి 10వ తేదీన అడ్మిట్ అయిం ది. అయితే,.. ఆరోగ్యశ్రీ ద్వారా ఆమెకు చికిత్స అందించారు. ఈ చికిత్సకు ఖర్చు అయిన 24 వేల 370 రూపాయలను ప్రభుత్వం భరించించినప్పటికీ.. అదనంగా పేషంట్ దగ్గర నుంచి 28 వేల 500ల రూపా యలను ముక్కు పిండి వసూలు చేశారు ఆస్పత్రి సిబ్బంది. ఇదేమని నిలదీస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఇంకా నగదు జమ కాలేదని.. చికిత్సతోపాటు మందులకు అయిన ఖర్చును ఇవ్వాల్సిందేనని దబాయించారు. చేసేదేమీ లేక అడిగినంత సొమ్మును వాళ్ల చేతిలో పెట్టి తిరిగొచ్చారు.
తర్వాత కొన్నాళ్లకు ఆస్పత్రి దోపిడిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు పేషంట్ సుజాత భర్త. ఘటనపై స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ఆరోగ్య శ్రీ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్ కిరణ్ కుమార్కు చేరవేశారు. ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇస్తే తమకు న్యాయం చేస్తానని, ఆస్పత్రిపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు కిరణ్కుమార్. ఆ తర్వాత ఆధారాలు పంపినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ, నోరు మెదపకుండా ఉన్నారు. దీంతో కిరణ్కుమార్ ప్రగల్భాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పేషంట్ కుటుంబీకులు. అధికారుల అండ చూసుకునే ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టానుసారం దోపిడికి పాల్పడుతూ పేద ప్రజల నుంచి వేలకు వేలు దోచేస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి . గతంలో ఇలాంటి ఘటనలే జరిగితే అప్పటి కలెక్టర్ నాగలక్ష్మీ వెంటనే చర్యలు తీసుకుని.. అవినీతికి పాల్పడిన ఆస్పత్రులను సీజ్ చేయించి బాధితులకు న్యాయం చేశారని గుర్తు చేసుకుంటున్నారు.ఇకనైనా ఉన్నతా ధికారులు ఆరోగ్య శ్రీ అక్రమాలపై దృష్టి సారించాలని.. పేద ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తు న్నారు.


