ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. బీజేపీ అభ్యర్థుల గెలుపుకు సంబంధించిన ఫలితాలు బయటకు వస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి ప్రతిపక్ష పార్టీ కన్నా వెనుకబడిపోయింది.
ఆప్ వెనుకబడటానికి కారణాలు
ఆమ్ ఆద్మీ పార్టీ 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. రెండు టర్మ్‌లో చాలా అద్భుతమైన పనితీరు కనబరిచింది. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ విషయంలో ప్రజల మెప్పు పొందింది. విద్యుత్, వాటర్ సబ్సిడీలు ఓటర్లను ఆకర్షించాయి. దీంతో అఖండ మెజార్టీతో ఆప్‌కు అధికారాన్ని కట్టబట్టారు. దేశ రాజధానిలో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనుకబడిన ఆప్.. ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ సమస్యను అధిగమించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇదే అక్కడి ప్రజలను నిరాశపరిచింది. అయితే తమ విధులకు బీజేపీ ఆటంకం కలిగిస్తుందని సర్కార్ విమర్శలు చేసింది. అయితే పదేళ్ల ఆప్ పాలనలో విమర్శలను ప్రజలు చూసీచూడనట్టు వదిలేశారు. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ చేసిన డబుల్ ఇంజిన్ సర్కార్ వాగ్దానం ప్రజలను ఆలోచించేలా చేసింది. ఇదే ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తోంది.
శీష్‌మహల్
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ.. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసింది. ఆయన శీష్‌మహల్ కోసం పెట్టిన ఖర్చును చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతాయని ప్రధాని మోదీ ఆరోపించారు. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మార్పులు చేర్పులకు వారు చేసిన ఖర్చుపై ప్రధానంగా టార్గెట్ చేశారు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా బాణాలు సంధించారు బీజేపీ నేతలు. కాగ్ నివేదిక ప్రకారం.. శీష్ మహల్ పునర్నిర్మాణానికి ప్రాథమిక అంచనా రూ .7.91 కోట్లుగా ఉంది. 2020 లో పనులు ప్రారంభించినప్పుడు ఇది 8.62 కోట్ల వరకు పెరిగింది. కాని 2022 లో ప్రజా పనుల విభాగం నిర్మాణం పూర్తి చేసే సమయానికి, ఖర్చు 33.66 కోట్లకు పెరిగింది.
ఆప్.. బీజేపీ చేసిన శీష్ మహల్ ఆరోపణలను రాజ్ మహల్ ఆరోపణలతో తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సంపన్నమైన జీవనశైలిపై ప్రధానంగా టార్గెట్ చేశారు. కానీ బీజేపీ ఇచ్చిన హామీల వైపే ప్రజలు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది.
లిక్కర్ పాలసీ
ఆప్ ప్రభుత్వం చివరి ఐదేళ్ల పాలనలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య లిక్కర్ పాలసీ. కొత్త పాలసీ తీసుకువచ్చిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీని తాగుబోతుల నగరంగా మార్చిందని బిజెపి ఆరోపించింది. మద్యం విధానంలో ఇటువంటి ఆరోపణలను ఆప్ ఖండిస్తూ వచ్చింది. తర్వాత కొత్త పాలసీని ఆప్ రద్దు చేసుకుంది.
సెంట్రల్ ఏజెన్సీల దర్యాప్తుతో ఆప్‌కు చెందిన అగ్ర నాయకులను అరెస్టు చేశారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టయిన వారిలో ఉన్నారు. సిసోడియాను అరెస్టు చేసిన తరువాత, అతను డిప్యూటీ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ చేశారు. ఆప్ కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించింది. ఆ తర్వాత సీఎంగా ఉన్న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. ఐదు నెలల పాటు ఆయన జైలులో ఉన్నారు. ఇంతమంది అగ్ర నాయకుల అరెస్టులు ఆప్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రజలకు 2020 ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా లిక్కర్ పాలసీ వల్ల పార్టీకి జరిగిన డ్యామేజ్‌ను సరిచేసుకోవడంపై దృష్టి సారించాయి.