27.2 C
Hyderabad
Thursday, February 6, 2025
spot_img

ఆజన్మ బ్రహ్మచారులకు, సంతాన రహితులకు పుణ్యగతులు ఉండవా…? అయితే భీష్ముడు పుణ్యాత్ముడు కాదా..? ఈ నెల 8న భీష్మ ఏకాదశి

మహర్షులు, మునిశ్రేష్ఠులు, మూల పురుషులు, మహనీయులు, యోగిపుంగవులు, పూర్వీకులు, పెద్దలు….యుగ ధర్మాలు, చతుర్వేదాలు, ఉపనిషత్తులు… గొప్పదనాన్ని వివరించి, ఆచరణ విధానాలు తెలియజేశారు. ఏ వేదం, ఏ ధర్మం… కర్మఫలార్హులు.. ఈ రీతిన ఉండి తీరాల్సిందే అని తీర్మానించదు. పుణ్య కర్మలు ఆచరిస్తే పుణ్యఫలాలు, పాప కర్మలు పాటిస్తే పాపఫలాలు వస్తాయని మాత్రమే చెబుతుంది. అయితే, కొందరు ధార్మిక గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు … తమ అపార జ్ఞాన సంపదతో సమాజంలో కొందరు అభాగ్యులను శాపగ్రస్థులుగా చిత్రీకరించి.. వీరి పాపపు చర్య వల్ల వారి పూర్వీకులు ఉత్తమగతుల నుంచి అధోగతి పాలవుతారని చెబుతున్నారు. యావత్ భాషలకు మాతృభాష, దేవనాగరలిపితో కూడిన మహత్తర సంస్కృత భాష తర్జుమా ప్రక్రియలో కొంత గందరగోళం, లేదంటే నానార్థాల భరితమైన శ్లోకాలను తమ ప్రతిభాపాటవ చాతుర్యంతో విపరీతార్థాలు జోడించి..సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే వైదిక గురువులు కొందరు తయారవుతున్నారు.

గురువు దగ్గర నేర్వని, గురు ముఖం కాని ఏ విద్య రాణించదని చాలామంది గురువులు చెబుతారు. అయితే, ఈ సందర్భంలో ఏకలవ్యడు నేర్చిన స్వీయ విద్య గురించి మాత్రం చెప్పరు. తమ చెప్పుచేతల్లోకి జనాలను తీసుకునే కొందరు గురువులు…చక్కగా ఉద్భొధించాల్సిన వాటిని దుర్భోధలుగా చేయడం సబబేనా అని కొందరు సామాన్య జనాలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్న ఈ మేధో గురువులు, వారు ఆర్థిక పరిపుష్ఠి సాధించడంలో మాత్రం అగ్రగామిగా ఉంటున్నారని అంటున్నారు. చాలామంది చెప్పేది.. ఏది మనది కాదు…పూచిక పుల్ల వెంట రాదు..అంటారు. ఈ సంగతి ఎవరికి మాత్రం తెలియదు. సొమ్ములు, దానాల గురించి చెప్పేవారి వెనక చూస్తే కోట్ల రూపాయల ఆస్తులు కనిపిస్తున్నాయి. అదంతా ధర్మమార్గంగానే సంపాదించిందా..? చిరుద్యోగిగానో, పిల్ల వ్యాపారిగానో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా ఆధ్యాత్మిక గురువుగా మారిపోయి ఈ బోధనలు చేసేస్తున్నారు. చిల్లగవ్వ, చిన్నిపైసా తీసుకోమని చెబుతూంటారు. ఈ ఆస్తులు వగైరాలు గురించి అడిగితే.. తమ వద్ద ఏం లేదని నిర్భయంగా చెప్పేస్తారు. అయితే, వాళ్లు చెప్పేది కొంత నిజమే అని కొందరు అంటున్నారు. ఏంటంటే ..వాళ్లు నిజ్జంగా చిల్లిగవ్వ, కాణీ, పరక తీసుకోరు…కోట్ల రూపాయలు, ఎకరాలు, సువర్ణ ఆభరణాలు తీసుకుంటారు.. బీనామీల పేరిట భద్రంగా ఉంచుతారు అనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి.

న్యాయంగానో, అన్యాయంగానో కోట్లు కూడబెట్టిన కోటీశ్వరులు, లక్షలు వెనకేసిన లక్షాధికార్లు, వేల రూపాయలు దాచుకున్న మధ్యతరగతి వారో, రోజు వారి దాచుకునే నిరుపేదలో.. అందరు తమ సొమ్మంతా అంతటా వెదజల్లేసి, అందరికీ పంచేసి బికారులుగా మారిపోవాలని చెబుతారు. ఇలా చెప్పిన చాలామంది మా గోప్ప గురువులందరూ…గన్ మేన్ లు, ఏసీ భవంతులు, ఫామ్ హౌస్ లు, కోట్ల రూపాయలు, లక్షల సంపదతో తులతూగుతుండడం జరుగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సొమ్ములు దాచడం, దాచుకోకపోవడం, ఖర్చు పెట్టడం, ఖర్చు పెట్టకపోవడం గురించి ఈ గురువులకెందుకో తాపత్రయం. అన్యాయంగా ఆర్జిస్తే ఆ పాపఫలాలు, న్యాయంగా ఆర్జిస్తే ఆ పుణ్యఫలాలు వాళ్లే అనుభవిస్తారు. వీళ్లు చెప్పాల్సింది ఏమిటి..? మంచి పనులు చేయాలి, మానవత్వంతో మెలగాలి, స్వల్పకాలం ఉండే జీవనంలో పుణ్యకార్యాలు చేస్తే, పూర్వ జన్మపాపాలు, ఇప్పటి పాపాలు పోయి ఉత్తమ జన్మలో, జన్మరాహిత్యమో పొందుతారని బోధనలు చేయాలి కాని, అంత భారీగా సొమ్ములు కూడబెట్టే బదులు ఏ ఆధ్యాత్మిక గురువుకో ఏ ప్లాటో, భవంతో ఇవ్వొచ్చు కదా అనే రీతిలో ఆధ్యాత్మిక బోధనలు సాగడం దురదృష్టకరం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.తమ అపార మేధా సంపత్తిని ఈ రీతిన వినియోగించి, గురువును త్రికరణశుద్దిగా నమ్మిన అమాయక ప్రజలను భయాందోళనలకు గురిచేసి నిలువుదోపిడీ చేయడం సమంజసమా…అనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి.

మన పూర్వీకులు పెద్దలు చెప్పిన సుభాషితాలు, మహత్తర శ్లోకాలకు, వక్రభాష్యాలు చేసి అమాయక ప్రజలను శోక సముద్రంలోకి దింపుతున్న సమర్థ ఆధ్యాత్మిక మేధావులు, ఈ రీతిన వ్యవహరించడం సరికాదు కదా..! ఇక విషయంలోకి వస్తే…..భీష్మ ఏకాదశి. ఇది హైందవజాతికి అతి పవిత్ర పర్వదినం. విష్ణుసహస్రనామం ఉద్భవించిన శుభదినం. పంచమ వేదంగా కీర్తింపబడే మహాభారతం అంటే జనగణాలే కాక దేవగణాలు ఆసక్తి చూపుతాయని పురాణ ప్రముఖులు చెబుతూంటారు. అంతటి మహాభారత గాథలో గంగాపుత్రుడు భీష్మాచార్యుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వీయ మరణం వరం పొందిన భీష్ముడు.. ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ప్రాణం నిలబెట్టుకుని.. అనంతరం స్వర్గపురికి చేరుకుంటాడని మహాభారతగాథ చెబుతోంది.

కురక్షేత్ర యుద్ధంలో నేలకొరిగిన భీష్మపితామహుని చూసి అర్జునుడు..తన అస్త్ర శస్త్ర విద్య ప్రదర్శించి బాణాలతో అంపశయ్యను ఏర్పాటు చేస్తాడు. తన ధనుర్విద్యా సామర్థ్యంతో భూతలం నుంచి గంగాజలాన్ని రప్పించి.. భీష్ముని దాహం తీరుస్తాడు. అంపశయ్యపైనే ఉత్తరాయణ పుణ్యఘడియలు వచ్చేవరకు సజీవుడిగా భీష్ముడు ఉంటాడు. భీష్మాష్టమి నుంచి పితామహుడు స్వీయ మరణానికి సిద్ధం అవుతాడు. ఇలా ఏకాదశి ఘడియలు వచ్చేవరకు ఉండి అప్పుడు తనువులోంచి ప్రాణాన్ని విడిచాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. విష్ణు సహస్రనామ కర్త భీష్ముడే. మాఘ శుద్ధ ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని శ్రీకృష్ణుని సన్నిధిలో ధర్మరాజుకు భీష్ముడు వినిపించాడు. అనంతరం ఆ మహనీయుడు పుణ్యలోకాలకేగి దైవైక్యం చెందడని తెలియజేస్తున్నాయి. అంపశయ్య మీద నుంచే భీష్ముడు ధర్మరాజుకు విష్ణుసహస్రనామాలు, ఆ నామాల మహత్యాన్ని, వైశిష్ట్యాన్ని వివరిస్తాడు. ఇందులోని 108 శ్లోకాలు…సమస్త జగత్తుకు సంబంధించిన విషయాలు ఉంటాయి. కష్టాలు, సమస్యలు, బాధలకు పరిష్కారాలు, బాధ్యతలు, కొలువులు, పరిణయాలు, ఆర్థిక విషయాలు.. ప్రతి దానికి ఒక శ్లోకం ఉంటుందని పండిత ప్రముఖులు చెబుతున్నారు.

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. ఈ మహనీయుని పూర్వ నామం దేవవ్రతుడు. మహా భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యనిష్ఠా గరిష్ఠుడిగా, మహా పరాక్రమ వంతుడిగా, అమిత బలవంతుడిగా భీష్ముడు పేరు పొందాడు. పిత్రువాంఛ నెరవేర్చడం కోసం తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిన ను తూచ తప్పక పాటించినవాడు భీష్మాచార్యుడు. పెళ్లి అనే మాటనే తన జీవితం నుంచి తొలగించిన భీష్ముడు, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని కఠోర నిర్ణయం తీసుకున్న భీష్ముడు… కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలిక స్వయంవరానికి ఎందుకు వెళ్లాడనే సందేహం రావచ్చు. శంతనుడు, గంగదేవి కి జన్మించిన దేవవ్రతుడే భీష్ముడు. గంగ నిష్క్రమణ అనంతరం శంతనుడు మత్స్యకన్య సత్యవతిని ఇష్టపడతాడు. అయితే, ఆ విషయం చెప్పలేక మథనపడతాడు.

ఎట్టకేలకు భీష్ముడు తన తండ్రి శంతనుని నుంచి ఆ విషయం రాబట్టి.. సత్యవతి తండ్రి దాసరాజు వద్దకు రాయభారానికి వెళతాడు. సత్యవతిని, తన తండ్రికి ఇచ్చి వివాహం చేయమని కోరతాడు. దానికి ఆయన.. తన బిడ్డ కుమారులకే రాజ్యాధికారం ఉండాలంటాడు. దానికి భీష్ముడు అంగీకరించినా.. భీష్ముని వివాహానంతరం వారి బిడ్డలు రాజ్యాధికారానికి వస్తారు కదా.. అని అంటాడు. అప్పడే భీష్ముడు ఘోర ప్రతిన పూనతాడు. ఆజన్మాంతం తాను వివాహం చేసుకోనని భీష్ముడు చెబుతాడు. ఆ రీతిగా…జరిగిన అనంతరం కొన్నాళ్లకు శంతనుడు తనువు చాలిస్తాడు.

శంతనుడు, సత్యవతి కుమారుడైన విచిత్ర వీర్యునికి వివాహం జరిపించాలని భీష్ముడు భావిస్తున్న తరుణంలో..కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరానికి భీష్ముడు వెళ్లి అక్కడి పరీక్షలన్నింటిలో విజయం సాధిస్తాడు. ఇందలో కొందరు రాజలు భీష్ముడి చేతిలో పరాజయం పాలవుతారు. స్వయంవరంలో విజయం సాధించి.. ఆ కన్యలను హస్తినాపురికి తీసుకువస్తాడు. స్వయంవరంలో గెలిచిన భీష్ముని పరిణయం ఆడాలని ఆ కన్యలు భావిస్తారు. అయితే, తన కథ చెప్పి..తాను ఆజన్మాంతం అవివాహితునిగానే ఉండాల్సి ఉందని, తన సోదరుడైన విచిత్ర వీర్యుని వరించాలని కోరతాడు. ఇందులో అంబిక, అంబాలిక విచిత్ర వీర్యుని వివాహం చేసుకుంటారు. విచిత్ర వీర్యుడు, అంబిక సంతానం ధృతరాష్ట్రుడు కాగా, అంబాలిక సంతానం పాండురాజు. ధృతరాష్ట్రుని కుమారులే దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన కౌరవులు.పాండురాజు, కుంతి, మాద్రి సంతానం పాండవులు. ఇక అంబిక, అంబాలిక విషయం ఇలా ఉండగా.. అంబ తాను సాళ్వు రాజును ప్రేమించానని భీష్మునికి చెప్పగా ఆమెను ఆ రాజు వద్దకు సగౌరవంగా పంపిస్తాడు. అయితే, తాను భీష్ముని చేతిలో ఓడిపోయానని, తనను ఓడించిన భీష్ముడినే పరిణయం చేసుకోవాలని పంపిస్తాడు. ఆజన్మ బ్రహ్మచారైన భీష్ముడు ఆమె ప్రతిపాదన తిరస్కరిస్తాడు. దీంతో.. ఆమె శిఖండిగా మారి కురుక్షేత్ర యుద్దంలో… భీష్ముడి పాలిట మృత్యుదేవతలా మారుతుంది.

ఏ పాపమూ చేయకపోయినా శిక్షలన్నీ భీష్ముడికి వచ్చిపడతాయి. చివరకు దురాలోచనా పరుడైన దుర్యోధనుని అధర్మపక్షాన ఉండి … ధర్మపరాయణులైన పాండవులతో సమరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, భీష్ముని మనస్సంతా ధర్మపక్షాన ఉంటుంది, ధర్మపరాయణులు విజయం సాధించాలని కోరుకుంటాడు. అలాగని.. కౌరవ సామ్రాజ్యానికి కించిత్ హాని జరగకుండా చూస్తాడు.. కౌరవుల తరఫున శక్తివంచన లేకుండా పోరాటం సాగిస్తాడు, పాండవసేనను కకావికలం చేస్తాడు. అన్నివిధాలా కష్టనష్టాలకు గురైనా.. భీష్ముడు మరణానంతరం పుణ్యలోకాలకు చేరతాడు. స్వయం మరణ అర్హత పొందిన బీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమపదిస్తాడు.

ఆలస్యం అమృతం విషం అని చెప్పిన పెద్దలు, ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పని చేయరాదని చెప్పారు. అంటే ఆయా సందర్భాలను బట్టి, ఆయా ఉద్ధేశాలను బట్టి ప్రతి విషయాలను, శ్లోకాలను, పద్యాలను అన్వయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని సూక్తులు, సుభాషితాలు ఘాటుగా చెప్పడంలో అర్థం సమాజ సక్రమ రీతికి ఎక్కడైనా భంగం వాటిల్లుతుందేమో అని ముందుచూపుతో సదుద్దేశంతో చెప్పిందే తప్ప..సనాతన సంప్రదాయం ఇలాగే చేయాలని మొండిగా ఆదేశించదు.

అపుత్రస్య గతిం నాస్తి, పుత్ర సంతానం లేకపోతే పున్నామ నరకం…అనే వాక్కులను లోతుగా అధ్యయనం చేస్తే.. సంతాన హీనులు, పుత్ర సంతాన హీనులకు సద్గతులు ఉండవనేది నిజం కాదని తేటతెల్లం అవుతోంది. సనాతన సంప్రదాయంలో సద్గతులనేవి సంతానాన్ని బట్టి నిర్ణయించబడవని పురాణ గ్రంథాలను ఆమూలాగ్రం పఠిస్తే విదితం అవుతుంది. పుణ్య కర్మలకు పుణ్య ఫలాలు, పాప కర్మలకు పాప ఫలాలు అని వేదాలు చెప్పినప్పుడు…పుణ్యపురుషుడైన ఆజన్మ బ్రహ్మచారి పాపాత్ముడవుతాడా…? పాప కర్మలు చేసిన గృహస్థు పుణ్యాత్ముడు అవుతాడా..? నరకలోకానికి వెళతాడా..? ఆజన్మ బ్రహ్మచారి అయినా భీష్ముడు పుణ్యలోకాలకు ఎందుకు వెళ్లాడు. సద్దుణ సంపన్నుడైనందు వల్ల, యుద్దంలో వీర మరణం పొందడం వల్ల స్వర్గలోకానికి వెళ్లాడు. పురాణాల్లో ప్రముఖమైన కార్తీక పురాణంలో చెప్పిందేమిటి…తెలియక కాని తెలిసికాని పవిత్ర కార్తీక మాస పర్వ దినాల్లో ప్రమిద వత్తుతో దీపం వెలిగిస్తేనే….పాపాలన్నీ దూదిపింజల మాదిరి పటా పంచలవుతాయని చెప్పలేదా..మరి కార్తీకవాస దీక్షలు అత్యంత శ్రద్దలతో పాటించేవారు బ్రహ్మచారులో, సంతాన రహితులో అయితే..వారికి పుణ్యఫలాలు రావా.. వీటికి ఎవ్వరు సమాధానం చెప్పలేరు.

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ ఈ పద్యంలో కవి ఏం చెప్పారు. ధృతరాష్ట్రునికి నూరుగురు కొడుకులు ఉన్నా ఏం ప్రయోజనమైందో అందరికీ తెలిసిందే కదా.. అయితే, ధర్మపరాయణులైన కుమారులుగా మరోవైపు పాండవులు కీర్తిప్రతిష్ఠలు పొందారు. మంచి, చెడు, చీకటి, వెలుగుల్లా అన్నిచోట్ల అన్ని కన్పిస్తాయి. కొరగాని కొడుకు పుట్టిన అనే పద్యంలో చెరకు తుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్లె చెరచు అని అన్నారు. సంతాన రహితుడైనంత మాత్రా శుకమహర్షి పుణ్యాత్ముడు కాదా.. పుణ్యలోకాలు దర్శించలేడా..? కుమారులు లేనంత మాత్రాన అమరలోకానికి వెళ్లడానికి వీల్లేదని నిర్ణయించేయడానికి మనం ఎవరం..?

అయితే, వివాహ ధర్మం ఉత్తమ ధర్మం. ఇందులో ఏ సందేహం లేదు. అన్ని ఆశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమం అత్యుత్తమం. గృహస్తాశ్రమం స్వీకరించిన వారే యజ్ఞ, యాగాదుల నిర్వహణకు అర్హులు. అందుకే సీతామాత దూరం అయ్యాక.. శ్రీరామచంద్రుడు అశ్వమేధయాగం చేయదలబెట్టినప్పుడు.. సువర్ణ సీత విగ్రహంతో ఆ క్రతువు ముగించాడు. ఇది శాస్త్ర సమ్మతం. అయితే, పుత్రులు లేనివారు, వివాహం కాని వారు పుణ్యలోకాలకే అర్హం కాదనడం.. దానికి కొన్ని శ్లోకాలు వల్లించి జనాలను తప్పుదారిపట్టించడం సరికాదని ఎందరో అవివాహిత మేధావులు తమ తమ వేదపాండిత్యంతో చెబుతున్నారు. దీన్ని ఎందరో సహృదయశీలురైన గృహస్థులు సమర్థిస్తున్నారు.

వేదవేదాంగాలు క్షుణ్ణంగా పఠించిన కొందరి పెద్దల వాక్కుల ప్రకారం సనాతన సంప్రదాయంలో సద్గతులు వివాహాన్ని, సంతానాన్ని బట్టి నిర్ణయింపబడవని తెలుస్తోంది. పురాకృత ప్రారబ్ధం, పురాకృత పుణ్యఫలాల వల్ల, ఇహలోకంలో చేసిన పాప,పుణ్య కార్యాల వల్లే గతులు నిర్ణయింపబడతాయని స్పష్టం అవుతోంది. యోగ వాసిష్ఠంలో రామ, వశిష్ఠ సంవాదంలో వసిష్ఠ మహర్షి వాక్కుల ప్రకారం.. సంతానం లేనివారు అమృతతుల్యులు అంటారని ఉందని పురాణ గ్రంథాలు ఆమూలాగ్రం పఠించిన పౌరాణికి ప్రముఖులు చెబుతున్నారు. పెళ్లి, పిల్లలు.. అన్ని భగవత్ సంకల్పాలే. భగవంతుని సంకల్పాలకే వికల్పాలు కల్పించేలా విమర్శలా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే.. ఆధ్యాత్మిక గురువులు సమాజంలో కొందరి వ్యక్తుల మనోభావాలు దెబ్బతినేలే ప్రసంగాలు చేయరాదని.. సనాతన సంప్రదాయంలో ఇలా ఉందని శ్లోకాలు వల్లెవేసి ఆయా వర్గాలకు పుణ్యలోకాలు, సద్గతులు ఉండవని భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ చేస్తే చెడ్డ జరుగుతుంది.. పూర్వజన్మలో పుణ్యాలు చేస్తే.. ఇప్పుడు పుణ్యఫలాలు వస్తాయి, ఆ జన్మలో పాపాలు చేస్తే ఆ పాపఫలం అనుభవించాల్సి వస్తుంది.. ఈ రీతిన ఆధ్యాత్మిక బోధనలు చేస్తే..ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. ఒకవేళ..ఈ గురువులు చెప్పిన విషయాలు సత్యవంతమైనవి అయితే.. ఆజన్మ బ్రహ్మచారి భీష్ముడు పాపాత్ముడా..? భీష్ముడు పుణ్యలోకాలకు వెళ్లాడని ఈ గురువులో చెబుతున్నారు కదా..! శ్లోకాల్లో ఉండే నానార్థాలను తమకు అనుగుణంగా చేసుకుని బోధనలు చేయడం సరికాదు. సాక్షాత్ ఆదిశంకరాచార్యులవారే… తమ అపూర్వ భక్తి రచనల్లో ఎక్కడా… ఎవరిపైనా నిందమోలేదు. ఈ తరహా సందర్భాలు వచ్చినప్పుడు ఆ నిందలు తనకు అన్వయించుకుని రచన చేసినట్టు కన్పిస్తుంది కాని.. ఇతరులపై కించిత్ పరుష వ్యాఖ్యానాలు కానరావు.

తలగడ కింద ఎవరో రూపాయి క్వాయిన్ పెడితే, ఏదో పురుగు దొల్చినంత బాధపడిన మహనీయులు రామకృష్ణ పరమహంసకు శారదా దేవిలకు సంతానం ఉందా..స్వామి వివేకానంద ఎవరు..? రుషుల్లో అగ్రగణ్యుడైన రాజర్షి వసిష్ఠ మహర్షి, అరుంధతులకు సంతానం ఉందా..? ఔరస సంతానం మాత్రమే సంతానం కాదని, ఎన్నో మంచి పనులు సంతాన పుణ్యఫలంతో సమానమని పెద్దలు చెబుతున్నారు. దాహార్తితో అల్లాడే వారికి దాహార్తి తీరిస్తే ఈ పుణ్యఫలం దక్కినట్టే అని పెద్దలు చెబుతున్నారు. దేవాలయాలకు సహకరించి ధార్మిక గుణం ప్రదర్శించినా, జీవితులుగా ఉన్న తల్లిదండ్రులు, అత్తమామలను అమితంగా ప్రేమించి ఆదరించినా, వారు గతించాక సక్రమ రీతిలో కర్మకాండలు సాగించినా పుణ్యఫలాలు దక్కుతాయని వేద గ్రంథాలే చెబుతున్నాయి.సాక్షాత్ ఆదిశంకరాచార్యులే ..మాతాచ పార్వతీదేవి, పితదేవో మహేశ్వరః, బాంధవాః శివభక్తాస్చ, స్వదేశో భువనాశ్రయం అని చెప్పారు కదా..!

అస్కలిత, ఆజన్మ బ్రహ్మచారి భీష్ముడు పుణ్యలోకాలకు వెళ్లిన పుణ్యతిథి మాఘ శుద్ద ఏకాదశి. ఇదే భీష్మ ఏకాదశి. దీనినే జయ ఏకాదశి, ఫలప్రద ఏకాదశి అని సైతం అంటారు. తిథుల్లో ఏకాదశి ఉత్తమం కాగా… ఏకాదశల్లో కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి అంత్యంత పుణ్యప్రదమైనవి. ఈ ఏడాది భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8 వ తేదీన వచ్చింది. రథసప్తమి నుంచి భీష్మ ఏకాదశి వరకు చాలా గ్రామాల్లోని దేవాలయాల్లో రథాలను ఉంచి రథోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఎన్నో ఆలయాల్లో భక్తులు ఎన్నో విశిష్టపూజలు, విష్ణుసహస్రనామ పఠనాలు, లలితా సహస్రనామ పారాయణలు చేయడానికి ఉద్యుక్తులు అవుతున్నారు.
————

Latest Articles

‘ఎటర్నల్‌’ గా జొమాటో రీ బ్రాండ్‌.. కొత్త లోగో

ఇండియన్‌ ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్‌.. జొమాటో తన పేరు మార్చుకుంది. కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. జొమాటో కాస్తా 'ఎటర్నల్‌' గా మారింది. కొత్త లోగోను కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్