బెంగళూర్ రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. గుట్టురట్టు కావడం,.. పలువురు స్టార్లు ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేయడంతో సినీ తారలు హడలెత్తిపోతున్నారు. గతంలో డ్రగ్స్ కేసు వ్యవహారంలా రేవ్‌పార్టీ కూడా ప్రముఖుల్లో గుబులు పుట్టిస్తోంది. మరి సినీ స్టార్లు ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత..? పోలీసుల దర్యాప్తుతో కేసు ఏ మలుపులు తిరగనుంది..? ఎవరి మెడకు చుట్టుకోనుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్‌హౌస్‌లో జరిగింది ఈ పార్టీ. అయితే,.. పక్కాసమాచారంతో కన్నడ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్టు గుర్తించారు. వీరిలో పలువురు సినీ స్టార్లు ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా హీరో శ్రీకాంత్, నటి హేమ ఉన్నారన్న వార్త హైలెట్‌గా మారింది. అలాగే ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ స్టిక్కర్‌తో ఉన్న కారు లభ్యంకావడంతో మినిస్టర్ కూడా పాల్గొని ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే,.. వీరందరూ కూడా రేవ్‌పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆరోపణలను ఖండించారు.
నటుడు శ్రీకాంత్ తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానన్న ఆయన.. తన ఇంట్లో నుంచి ఓ వీడియో తీసి షేర్ చేశారు. తనలాంటి వ్యక్తి ఆ పార్టీలో పట్టుబడడంతో అందరూ తననే అనుకున్నారని దీంతో తనకు కూడా కాల్స్ వచ్చాయన్నారు. రేవ్ పార్టీలో దొరికిన వ్యక్తి ఎవరో కానీ, కొంచెం తనలాగే ఉన్నాడని చూసి షాకయ్యానని చెప్పుకొచ్చారు.
రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదని.. అంతకుముందు కూడా తన భార్యకు విడాకులు ఇచ్చినట్టు పుకార్లు చేశారని అన్నారు హీరో శ్రీకాంత్.
ఇక నటి హేమ కూడా తాను హైదరాబాద్ ఫామ్ హౌస్‌లో ఉన్నానని, ఇక్కడే చిల్ అవుతున్నానని బెంగుళూరు రేవ్ పార్టీలో లేనంటూ వీడీయో ద్వారా తెలిపారు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు హేమ. అయితే,.. హేమ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తాను బెంగళూరులోనే ఉండి హైదరాబాద్‌లో ఉన్నట్లు వీడియో విడుదల చేయడంతో మరో కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఇక కొరియాగ్రాఫర్ జానీ కూడా రేవ్‌పార్టీలో ఉన్నారని వార్తలు వినిపిస్తుండటంతో ఆయన కూడా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తానూ ఈ రేవ్ పార్టీలో లేను అని.. చేతుల మధ్యలో ముఖం దాచుకొని వస్తున్న మనిషిని తాను కాదని రాసుకొచ్చాడు. ఇకపోతే ఏపీ మంత్రి కాకాణి కూడా వివరణ ఇచ్చారు. పార్టీలో తన పేరుతో స్టిక్కర్ ఉన్న కారు తనది కాదని అన్నారు. స్టిక్కర్ అసలైనదా, కాదా అన్నది పోలీసులు తేలుస్తారన్నారు. అయితే ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలని ఎస్పీని కోరుతూ.. కాకాణి పీఏ వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు రేవ్‌పార్టీపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కూపీ లాగుతున్నారు. దీంతో విచారణలో సంచనలన నిజాలు బయటకు వస్తున్నాయి. సన్‌సెట్ టూ సన్‌రైజ్ విక్టరీ పేరుతో ఈ పార్టీని భారీ ఏత్తున ఏర్పాటు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వ్యాపారి, క్రికెట్ బూకీ వాసు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు గుర్తించారు. దాదాపు 150 మంది ప్రముఖులు ఈ పార్టీకి హజరయ్యారనట్టు సమాచారం. ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించగా.. డగ్ర్ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్, రాజ్ కూడా రావడంతో డ్రగ్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే,.. పార్టీ ఇచ్చిన వాసుకి ప్రముఖులతో ఉన్న సంబంధాలు, పాత కేసులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే,.. హైదరాబాద్‌లో రేవ్, డ్రగ్స్ పార్టీలపై పోలీసుల నిఘా పెరగడంతోనే మకాం బెంగళూరుకు మార్చినట్టుగా సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న వారి రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేసినట్టు తెలిపారు పోలీసులు. సుమారు 15.56 గ్రాములు ఎండీఎంఏ, 6.2 గ్రాముల హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇలా మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ అటు కర్ణాకటలోనే కాదు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. మరి ఈ కేసులో పోలీసులు తీగ లాగుతుండటంతో డొంక కదులుతుందా..? అదే జరిగితే కేసు ఏ మలుపులు తిరగనుంది..?ఇంకా ఎవరెవరి మెడకు చుట్టుకోనుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.