ఏపీలోకి పలు కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టబోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్ పర్యటన నుంచి తిరిగొచ్చిన నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. థింక్ గ్లోబల్, యాక్ట్ గ్లోబల్ తమ విధానమని చెప్పారు. గత విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని.. రామాయంపట్నంలో రూ.95వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ వస్తుందని వివరించారు. ఎల్‌జీ కంపెనీ 5వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. రూ.65వేల కోట్లతో రిలయన్స్ బయో ఫ్యూయల్ ప్లాంట్, విశాఖలో ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. టీసీఎస్ సహా అనేక కంపెనీలు రాబోతున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ” 1997 నుంచి దావోస్ పర్యటనకు వెళ్తున్నాను. దేశంలోనే మొదట దావోస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నది నేనే. సీఎంగా ఉన్న ప్రతిసారీ దావోస్‌కు వెళ్తున్నాను. మొదట్లో నాకు, కర్ణాటక నాటి సీఎం ఎస్‌ఎం కృష్ణకు పెట్టుబడులు రాబట్టడంలో పోటీ ఉండేది. మేము దావోస్‌లో 37 సమావేశాల్లో పాల్గొన్నాం. 5 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యాం. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించాం. ఇప్పుడు ప్రపంచమంతా ఏఐ వైపు చూస్తోంది. ఏపీని ప్రపంచ పటంలో పెట్టడమే లక్ష్యం. ఏపీని మరో పెట్రో కెమికల్ హబ్‌గా తయారు చేస్తాం. గతంలో మేము ఐటీపై ఫోకస్ పెట్టాం. ఇప్పుడు ఏఐపై దృష్టి పెట్టాం. సముద్రతీరం ఉండటం ఏపీకి గొప్ప అవకాశం. సమర్థవంతంగా వినియోగించుకుంటే బ్లూ ఎకానమీ పెరుగుతుంది. సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా మార్చడమే మా లక్ష్యం.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్లు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలు జన్మభూమికి, కర్మభూమికి పనిచేయాలి. ప్రపంచ పారిశ్రామికవేత్తలంతా దావోస్‌కు వస్తారు. కాబట్టి అక్కడికి మిస్ అవ్వకుండా వెళ్తున్నాం. దావోస్‌లో అంతా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ట్రెండ్ కనిపించింది. దావోస్ అంటే అనేక అపోహలు ఉన్నాయి. ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారని అడుగుతున్నారు. దావోస్‌కు వెళ్లడం వల్ల పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం వస్తుంది. గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాం. థింక్ గ్లోబల్, యాక్ట్ గ్లోబల్ మా విధానం
దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. రామాయంపట్నంలో రూ.95వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ వస్తోంది. ఎల్‌జీ కంపెనీ రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. రూ.65వేల కోట్లతో రిలయన్స్ బయో ఫ్యూయల్ ప్లాంట్ రాబోతుంది. విశాఖలో ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు. టీసీఎస్ సహా అనేక కంపెనీలు రాబోతున్నాయి”.. అని చంద్రబాబు చెప్పారు.