ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో ఎన్డీయే గెలిచిన తర్వాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపు మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారానికి కూడా పవన్ హాజరుకానున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన చోట్ల బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో బీజేపీ వర్గాల్లో పవన్ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ సేవలను జాతీయస్థాయిలో వినియోగించుకోవాలని బిజెపి అగ్ర నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే బీజేపీ హైకమాండ్ పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు త్వరలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తమిళనాడులో కూడా త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాట ఎంతో కాలంగా సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అక్కడ పవన్ సేవలను ఉపయోగించుకునే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.