స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడున్నర గంటలపాటు 55 అంశాలపై కేబినెట్ భేటీ జరిగింది. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులు రాష్ట కేబినెట్ చేసింది. అలాగే.. అసైన్‌మెంట్ ల్యాండ్ విషయంలో, నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ సర్కార్. ఏపీ సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్5 జోన్‌లో 47 వేల ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. అసైన్డ్, లంక భూములపై హక్కులు కల్పించేలా ఆమోదం తెలిపింది మంత్రి మండలి.. ఇక, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన 22(A) లో ఉన్న భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగింపుకు ఆమోద ముద్ర పడింది. అసైన్డ్ భూములపై అనుభవదారులకి సర్వ హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 20 సంవత్సరాలకు ముందు కేటాయించిన భూములకు సైతం హక్కులు కల్పించేలా నిర్ణయించారు. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ-విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి.
రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ. తద్వారా పూర్తి హక్కులు కల్పిస్తారు. వైఎస్సార్ సున్నా వడ్డీ ఈ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం నుంచి వచ్చిన క్లియరెన్స్‌తో.. వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్ ఓకే చెప్పింది.
అజెండా అంశాలపై చర్చ అనంతరం మంత్రులతో రాజకీయ అంశాలపై కూడా సీఎం వైఎస్ జగన్ చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఇక, జగనన్న సురక్ష అమలుపైనా కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందట.. అద్భుతమైన ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అంటూ.. వారిపై ప్రశంసలు కురిపిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.