పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఏపీ స్పీకర్ తమ్మినేని అనర్హత వేటు వేశారు. పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంది. ఇదంతా ఇలా ఉంటే స్పీకర్ నిర్ణయం పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నిర్ణయం వెలువడడం వెనుక వ్యూహం ఏమైనా ఉందా..? ఎమ్మెల్యేల పై ఇన్నాళ్లకు చర్యలు తీసుకోవడం వెనుక కారణం ఏంటి..? స్పీకర్ నిర్ణయం ఎమ్మెల్యేల పై ఎంత వరకు ప్రభావం చూపనుంది..? పార్టీ మారే వారు రాజీనామా చేసి రావాలన్న జగన్ మాటలు చాన్నాళ్లుగా ఎందుకు అమలు కాలేదు..?
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అంతకు ముందు ఫిరాయింపులపై ఎమ్మెల్యేలను స్పీకర్ వివరణ కోరారు. అనంతరం వారిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుదారుల్లో వైసీపీకి చెందిన నలుగురు, టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవితో పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్‌లపై కూడా అనర్హత వేటు పడింది. టీడీపీ, వైసీపీ విప్‌లు చేసిన ఫిర్యాదులు ఇంకా అలాగే ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలను పరిశీలించిన స్పీకర్, మొత్తం 8 మంది సభ్యులు పార్టీ ఫిరాయించినట్టు తేల్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ ఆదేశాలతో ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే స్పీకర్ నిర్ణయంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై మండిపడుతున్నారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించాలంటే.. నిర్ణయాలు త్వరితగతిన తీసుకునే వ్యవస్థ ఉండాలంటున్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువలడుతున్న సమయంలో స్పీకర్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
పార్టీ ఫిరాయింపుదారుల్లో ఒకరైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పీకర్ నిర్ణయం స్పందించారు. అనర్హత వేటు వల్ల తమకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఈ ఎపిసోడ్‌లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఏడాది క్రితమే పార్టీ నుంచి వైసీపీ తమను సస్పెండ్ చేసింద..పార్టీ నుంచి తొలగించిన తర్వాత తమపై అనర్హత వేటు వేసే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. జగన్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే…నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్న వెంటనే వారిపై వేటు వేసేదన్నారు. తమ నియోజకవర్గాల సమస్యలపై పోరాడితే సస్పెండ్ చేశారని ఫైర్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు సరికాదన్నారు కోటంరెడ్డి.
మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనుకుంటే పార్టీ ఫిరాయించిన వెంటనే ఎమ్మెల్యేల పై చర్యలు తీసుకోవాల్సిందని విశ్లేషకులు మాట. ఇది పక్కా ఎన్నికల వ్యూహమే అంటున్న పలువురు. స్పీకర్ నిర్ణయం ఎమ్మెల్యేల పై ప్రభావం చూపుతోందంటున్న మరికొందరు. చూడాలి మరి లాస్ట్‌కు ఏం జరుగుతోందో..?