Cm Jagan fires on Chandrababu: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రెండు కీలక తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చుతూ ఒక తీర్మానం… దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని మరో తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ వేయగా.. ఈ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా ఈ తీర్మానం చేశామని.. వీటిని ఆమోదించి కేంద్రానికి పంపుతున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. ప్రజాధనాన్ని తనకు కావాల్సినవారికి చంద్రబాబు కట్టబెట్టారని మండిపడ్డారు. అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. ‘చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ డీల్ చేశారు. ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ సంస్థలకు నిధులు మళ్లించారు. చివరిగా ఈ నిధులన్నీ చంద్రబాబుకు చేరాయి’ అంటూ కుండ బద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించారు.