తెలంగాణ నుంచి మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి వైజాగ్, తిరుపతి మధ్య రెండు వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు మరో వందే భారత్ రైలు నడపాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ మరో వందేభారత్ రైలు గురించి స్థానిక బీజేపీ నేతలతో చర్చించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.
ఇప్పటికే కాచిగూడ నుంచి బెంగళూరుకు పలు రైళ్లు నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి బెంగళూరు చేరడానికి 11గంటల సమయం పడుతోంది. వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం 7-8గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఐటీ హబ్ లుగా ఉన్న ఈ రెండు నగరాలను కలుపుతూ ప్రారంభమయ్యే సెమీ హైస్పీడ్ రైలుకు ఆదరణ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరోవైపు సికింద్రాబాద్ నుంచి పుణెకు కూడా వందేభారత్ రైలు నడిపే అవకాశాలు ఉన్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన రెండు వందేభాతర్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కాగా ఈ ఏడాది జనవరి 14 సికింద్రాబాద్-వైజాగ్, ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే.