స్వతంత్ర వెబ్ డెస్క్: కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ మరువకముందే శనివారం తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ లో మరో రైలు ఘోర అగ్నిప్రమాదానికి గురి అయింది. రామేశ్వరం నుంచి కన్యాకుమారి వరకు వెళుతున్న రైలులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరగడంతో కలకలం రేపుతుంది. రైలులోని ప్రైవేటు పార్టీ కోచ్‌ను ఐఆర్‌సీటీసీ పోర్టల్ నుంచి డబ్బులు చెల్లించి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అయితే ఆ కోచ్‌లో టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది.
తీవ్రంగా మంటలు చెలరేగి బోగీ మొత్తం దగ్ధమయ్యింది. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకుదిగడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది మృతి చెందగా,మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు ఉత్తరప్రదేశ్ వాసులు కాగా అందులో 3 మహిళలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
సమాచారం తెలుసున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో రైలులో మొత్తం 63 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. అయితే రైలులో గ్యాస్ సిలిండర్ తీసుకవెళ్లడానికి అనుమతి ఉండదు. కానీ ఆ సిలిండర్‌ను ప్రయాణికుడొకరు రహస్యంగా తెచ్చినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.