స్వతంత్ర, వెబ్ డెస్క్: తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాదాలకు అడ్డాగా మారాయి. గత కొన్ని రోజులుగా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంపై ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ఏడుకొండలు ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ అనుభూతితో తిరుగు ప్రయాణం అయ్యే భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాలంటేనే వణికిపోతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన భక్తులు వెళ్తున్న కారు మొదటి ఘాట్ రోడ్డులో చివరి మలుపు వద్ద రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా ఇటీవల ఘాట్ రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా.. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో టీటీడీ అధికారులు వెంటనే స్పందించి ప్రమదాలకు గల కారణాలను తెలుసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.