ఏపీకి మరో అల్పపీడనం ముప్పు ఉందని హెచ్చరించింది వాతావరణశాఖ. ఇప్పటికే రాష్ట్రంలో కుండపోత వానలు కురుస్తుండగా.. అక్టోబరు 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.