రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ, కోనసీమ జిల్లా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అటు రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ వర్షం కురుసింది. గంటపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో పట్టణంలోని ప్రధాన కూడల్లలో భారీగా వర్షం నీరు చేరింది. కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డ్రైనేజీ నీరు కాలనీల్లోకి రావడంతో విషజ్వరాలు ప్రబలుతాయని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఏలూరు జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో మూడు రోజులుగా సముద్రం ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఒడ్డున ఉన్న దుకాణాల వరకూ నీరు వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ విషయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాలు జలమయం అయ్యాయి. రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహల్, కనేకల్ మండలాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమలాపురం గ్రామ సమీపంలో గంగమ్మ వంక పొంగి పొర్లడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.