స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ ప్రజలకు ఇప్పటికే చాలా పార్కులు, అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ మరొకటి ఈ లిస్టులో చేరుతోంది. ఇది ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్. ఇది ఐటీ కారిడార్‌ని కలుపుతూ, ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఉంది. ఇది మొత్తం 23 కిలోమీటర్ల పొడవు ఉంది.హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథార్టీ (HMDA) దీన్ని నిర్మించింది. ఈ సైకిల్ ట్రాక్ పైన సోలార్ ప్లేట్లు ఉంటాయి. అందువల్ల 16 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ దీన్ని ఇవాళ (అక్టోబర్ 1, 2023) ప్రారంభిస్తారు.
ఈ ప్రాజెక్టుకి 2022 సెప్టెంబర్ 6న కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మొత్తం 23 కిలోమీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పు గల సోలార్ రూఫ్ కలిగిన సైకిల్ ట్రాక్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఆ ప్రకారమే నిర్మాణం జరిగింది. ఈ సైకిల్ ట్రాక్‌ని నానక్‌రామ్ గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకూ ఉన్న 8.5 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకూ ఉన్న 14.5 కిలోమీటర్లలో నిర్మించారు.
సౌత్ కొరియాలో ఇలాంటి ట్రాక్ ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌కి ఒకరు చెప్పడంతో.. దాన్ని పరిశీలించేందుకు కేటీఆర్.. అధికారులను దక్షిణ కొరియాకి పంపారు. అలాగే దుబాయిలో కూడా ఇలాంటిది ఉండటంతో.. అక్కడికీ పంపారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో నిర్మించారు. ఇలాంటిది ఇండియాలో ఎక్కడా లేదు. ఇంటి నుంచి ఆఫీసుకి సైకిల్‌పై వెళ్లాలనుకునేవారికి ఈ సైకిల్ ట్రాక్ చాలా బాగుంటుంది. హైదరాబాద్‌లో ఎండలు ఎక్కువే కాబట్టి.. సోలార్ పవర్ ఉత్పత్తికి కూడా ఇది చాలా బాగుంటుంది.