స్వతంత్ర వెబ్ డెస్క్: అమరావతి ఏపీలో మహిళల అదృశ్యం, వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళల మిస్సింగ్ ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు పవన్ కల్యాణ్‌పై అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వారాహి యాత్రలో పవన్ తమపై నిందలు వేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వాలంటీర్లు చెప్పారు. తాము ఏం చేస్తున్నామో ఆయన చూశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కాగా, ఆదివారం ఏలూరు సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో కనపడకుండా పోయిన 29 వేల మందికిపైగా మహిళల వెనుక వాలంటీర్లు ఉన్నారని కేంద్ర నిఘా వర్గం చెప్పిందని ఆరోపణలు చేశారు. ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్ చేయడం, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడం ఇదే వాలంటీర్ల పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.