నిండుకుండను తలపించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు, నిప్పుల వర్షం కురిపిస్తున్న సూరీడి ప్రతాపానికి ఎడారిలా మారింది. లక్షలాది ఎకరాలకు సాగు నీరందించి, కోటాది మంది గొంతులను తడిపి తాగు నీరందిందే గోదావరి నీళ్లో రామచంద్రా అంటోంది. పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండాల్సిన ప్రాంతమంతా బీడుబారింది. గలగల పారే గంగమ్మ మూగబోయింది.
మహారాష్ట్రలోని నాసిక్‌లో పుట్టి మూడు రాష్ట్రాలను పునీతం చేస్తూ, దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది నేడు నీటి బొట్టు లేక అల్లాడుతోంది. తాగు, సాగు నీటి కష్టాలను తీర్చే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎడారిలా మారడంతో ఎలంగాణ ప్రజానీకం, ఎండిన డ్యాంను చూసి కంటతడి పెడుతోంది. బువ్వ పెట్టే భూతల్లి గుక్కెడు నీళ్లు లేక నెర్రలు వారుతుంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్న గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు. జీవనధులుగా పేరున్న గోదావరి, ప్రాణహిత నదులను ఒడిసిపట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నాడు వైఎస్ఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. ఏటిని ఎదురించి బ్యారేజీలు కట్టి బీళ్ళుగా మారిన పంట పొలాలను పచ్చగా చేసిన జీవనది నేడు జీవచ్ఛవంలా మారింది.
ఉమ్మడి కరీంనగర్ మెదక్ జిల్లాలతో పాటు జంట నగరాలకు నీరందిస్తూ NTPCRFCL పరిశ్రమలకు ఎల్లంపల్లి నుండి నీటిని వాడుకుంటారు. ప్రాజెక్టు మొత్తం నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7. 29 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 3.3 టీఎంసీలు కాగా గత పది రోజుల నుండి దంచి కొడుతున్న ఎండల కారణంగా రోజుకు 100 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారుతోంది. నిప్పుల కొలిమిలా భగభగ మండుతున్న సురీడు ప్రతాపం ఇలాగే ఉంటే, ఈ నెల చివరి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్‌కి వెళ్లే ప్రమాదం ఉందని అక్కడి రైతాంగం గుండెలు బాదుకుంటున్నారు. అదే జరిగితే మూడు జిల్లాల ప్రజలతోపాటు జంట నగరాలకు తాగునీరు కష్టాలు తప్పవు. మరోవైపు ఎల్లంపల్లిలో ఇంటెక్ వెల్ వద్ద నీటిమట్టం 140 మీటర్లు ఉండగా మరో రెండు మీటర్లు తగ్గితే నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని, ఎనిమిది సంవత్సరాల కిందటి పరిస్థితి పునరావృతం కాబోతుందని రైతులు హెచ్చరిస్తు న్నారు. ఇక నీటి నిల్వలు అడుగంటితే నీటిని తరలించేందుకు ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలో కిలోమీటర్ వరకు రోడ్డు నిర్మించి, విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేసి.. 25 సబ్ మెర్సిబుల్ పంపులను ద్వారా నీటిని తోడేందుకు అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులతో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి చూపించారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం గోదావరి నదితో మమేకమై సస్యశ్యామలంగా మారింది. గడిచిన దశాబ్దకాలం జలకళతో గలగల పారిన గోదావరి నేడు చుక్క నీరు లేక అల్లాడిపోతోంది. పాలకుల నిర్లక్ష్యమో ప్రకృతి ప్రకోపమో తెలియదు కానీ, ఎన్నడూ లేని విధంగా ఎల్లంపల్లి ఎడారిగా మారడంతో అక్కడి జనం ఆందోళన చెందుతున్నారు. ముందు చూపుతో ప్రాజెక్టులో నీటిని నింపాల్సిన సంబంధిత శాఖ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గోదారి నీటిని సముద్రం పాలు కాకుండా ప్రాజెక్టుల్లో నీరు నింపి తెలంగాణ పొలాల్లో సిరులు పండించే విధంగా పాలకులు ప్రణాళికలు రూపొందించాలని కోరుకుంటున్నారు ఎల్లంపల్లి పరిసర ప్రాంత వాసులు. అప్పుడే తాగు, సాగు నీటితో జనం కష్టాలు తీరుతాయని.. పచ్చని పంట పొలాల లో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందంటున్నారు.


