ఆ అమ్మాయి చిన్నతనం నుంచి క్రికెట్ పై ప్రేమతో ఆడటం మొదలుపెట్టింది. తన సొంత ఊరైన కర్నూలు జిల్లా ఆధోనిలో తనతో ఆడేవాళ్లే కరువయ్యారు. అయినా సరే, పట్టు వదలకుండా క్రికెట్ పై ప్రేమతో, అకుంఠిత దీక్షతో చిన్ననాటి నుంచి సాధన చేసి ఆస్ట్రేలియాలో టీ-20 మహిళా క్రికెట్ జట్టుకి ఎంపికైంది…అంజలి శ్రావణి
డిసెంబర్ 9 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ-20 సిరీస్ కి ఎంపికైన జట్టుతో అంజలి శ్రావణి కూడా విమానం ఎక్కబోతోంది. అబ్బాయిలకే క్రికెట్ గానీ, అమ్మాయిలకు కాదనే వాదనలను పక్కన పెట్టిన అంజలి తల్లిదండ్రులు ఈ వ్యవస్థను ఎదిరించి క్రికెట్ నేర్చుకునేందుకు అంజలిని గ్రౌండుకి పంపించారు.
తనకి క్రికెట్ నేర్పించేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని అంజలి స్నేహితులు చెబుతున్నారు. అలాగే కోచ్ లు, ఉపాధ్యాయులు ఎంతోమంది సహాయ సహకారాలతో తనీ స్థాయికి చేరినట్టు తెలిపారు.
ఈ రోజున భారత మహిళా క్రికెట్ కు ఎంపిక కావడం పట్ల వారెందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. భారతదేశ ప్రతిష్టను నిలబెట్టేలా తన కుమార్తె ఆడాలని కోరుకుంటున్నట్టు ఆ తల్లిదండ్రులు చెప్పడం విశేషం.