స్వతంత్ర వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ ఓటర్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరో హామీ ప్రకటించారు. మళ్లీ భాజపా అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అయోధ్య దర్శన అవకాశం కల్పిస్తామని తెలిపారు. సోమవారం విదిశా జిల్లాలోని సిరోంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమిత్ షా ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘‘నేను భాజపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామమందిర నిర్మాణ తేదీ ఎప్పుడని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పదే పదే అడిగేవారు. ఆయనకు ఇప్పుడు సమాధానం చెబుతున్నా.. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది’’ అన్నారు. వెంటనే అక్కడున్న భాజపా సీనియర్ నేత ఒకరు.. ‘‘అయోధ్య రాముడి దర్శనం కోసం మేము డబ్బు ఖర్చు చేయాలా?’’ అని ప్రశ్నించారు. దీనికి అమిత్ షా బదులిస్తూ..‘‘అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మధ్యప్రదేశ్‌లో భాజపా మరోసారి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే రాష్ట్ర ప్రజలను దశలవారీగా అయోధ్యకు తీసుకెళ్తాం. మా ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని చేర్చాం’’ అని వెల్లడించారు. రాష్ట్రంలోని 93 లక్షల రైతుల ఖాతాల్లో ఇప్పుడు ఏటా జమ చేస్తున్న రూ.6 వేల మొత్తాన్ని కూడా రెట్టింపు చేస్తామన్నారు. కుమారుల కోసం రాజకీయాల్లో ఉన్నవారు మధ్యప్రదేశ్‌కు మంచి చేయలేరని కాంగ్రెస్ నేతలను అమిత్ షా విమర్శించారు.