అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో రేపటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమలాపురంలో 108 కలసాలతో మహిళలు ఊరేగింపుగా అమ్మవారిని వెండి పల్లకిలో ఊరేగిస్తారు. దసరా వేడుకల్లో భాగంగా శ్రీ మహలక్ష్మీ అమ్మవారి అవతారం రోజున అమ్మవారిని మూడు కోట్ల రూపాయల కొత్త నోట్లతో అలంకరిస్తామని ఉత్సవాల నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిటీ చెప్పారు.