స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తైన అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ కోరేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కోర్టు రిమాండ్ విధిస్తుందా..? రిలీఫ్ ఇస్తుందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
మరోవైపు సోమవారం వరకూ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది.. న్యాయస్థానానికి తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు వివరాలు సమర్పిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో అల్లు అర్జున్ పిటిషన్‌పై విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు.
ఇక సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తన జోక్యం ఉండదని సీఎం స్పష్టం చేశారు. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ తో టాలీవుడ్ షాక్ కు గురైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం కలకలం రేపుతోంది. బన్నీ అరెస్ట్ వార్త తెలియగానే విశ్వంభర షూటింగ్‌ను చిరంజీవి రద్దు చేసుకున్నారు. భార్య సురేఖతో కలిసి చిరంజీవి అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. చిరంజీవి సోదరుడు నాగబాబు, కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంవో ట్విటర్ హ్యాండిల్ నుంచి ఈ ట్వీట్ వచ్చింది. కలిసి ఉంటేనే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం అనే అర్థం వచ్చేలా ఇంగ్లీష్ కోట్ ట్వీట్ చేసింది. అయితే సంధ్య థియేటర్ వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.