23.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

ఆశల పల్లకిలో ఇండియా కూటమి

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం హోరెత్తుతోంది. “వికసిత్ భారత్”.. “ఔర్ ఏక్ బార్ ..మోదీ సర్కార్”.. “ఇస్ బార్ 400 పార్” అంటూ భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ఊదరగొడుతోంది. అయితే ప్రచారం జరిగిన రేంజ్‌లో క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి సానుకూల వాతావరణం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్డీయే కూటమికి 400 సీట్లు రావడం అంత సులభం కాదంటున్నారు. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే అటు ఇండియా కూటమి ఇటు భారతీయ జనతా పార్టీ దాదాపుగా సమ ఉజ్జీవులుగా ఉన్నాయి. అంతేకాదు కొన్ని లెక్కల ప్రకారం మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, రాజస్థాన్‌, తెలంగాణ, హర్యానా, పంజాబ్‌, ఢిల్లీలలో ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు లభించే అవకా శాలు ఏమాత్రం లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఒక అధ్యయనం ప్రకారం మహారాష్ట్రలో బీజేపీకి ఈసారి చాలా తక్కువ సీట్లు వస్తాయి. ప్రతిపక్షాల నాయకత్వంలోని మహా వికాస్ అఘాడి రాష్ట్రంలోని మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఇండియా కూటమి లెక్కలు వేసుకుం టోంది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనను చీల్చడం అలాగే శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చడం మహారాష్ట్ర వాసులకు మింగుడు పడలేదు. శివసేనను ఎంతగా ప్రేమిస్తారో మరాఠా దిగ్గజం శరద్ పవార్‌ను కూడా మహారాష్ట్ర అలాగే ప్రేమిస్తారు. మొత్తంమీద పశ్చిమ భారతదేశంలో ఎన్డీయే కూటమికి దాదాపు పాతిక సీట్ల కొరత ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు పరిశీలకులు. అంతేకాదు మహారాష్ట్రలోని దళితులు, ముస్లింలంతా గంపగుత్తగా ఇండియా కూటమికి జై కొట్టే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాశ్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ అఘాడీకి ఏడు శాతం ఓట్లు వచ్చాయి.దీనివల్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎనిమిది సీట్లు కోల్పోవలసి వచ్చిందన్నది ఒక అంచనా. ప్రస్తుతం రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్లకు భద్రత, ఉద్యోగాల కల్పన వంటి అంశాల మీద ఇండియా కూటమి దృష్టి పెట్టింది. దీంతో ప్రకాశ్ అంబేద్కర్, ఇండియా కూటమికే మద్దతు పలుకుతు న్నారు. దక్షిణాదిన గల కర్ణాటకలో మెజారిటీ సీట్లపై ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. కర్ణాటకలో సిద్దరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, ఇండియా కూటమికి ప్లస్ పాయింట్‌గా మారింది. 2019లో కర్ణాటకలోని మొత్తం 28 సీట్లకు బీజేపీ 25 సీట్లు గెలుచు కుంది. అయితే కిందటేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌వైపే ఉన్నారన్న ప్రచారం నడుస్తోంది. కాగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కనీసం 14 సీట్లు అయినా గెలుచుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది. అలాగే హర్యానా, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో తమకున్నంత బలం బీజేపీకి ఉండకపోవచ్చని ఇండియా కూటమి లెక్కలు వేస్తోంది. ఈ రాష్ట్రాల్లో కనీసం ఇరవై సీట్లు తమకు దక్కడం ఖాయమని ఇండియా కూటమి గట్టి నమ్మకంతో ఉంది. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హర్యానాలో మొత్తం పది నియోజకవర్గాలను , ఢిల్లీలో ఏడు సీట్లను, పంజాబ్‌లో రెండు సీట్లను గెలుచుకుంది. అయితే కమలం పార్టీకి ఈసారి అంత సీన్ లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తనకు బలం ఉన్నచోట్ల కూడా తగ్గి ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. పెద్దన్న పాత్ర పోషిస్తోందని తనపై పడ్డ ముద్రను చెరిపేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. నరేంద్ర మోడీ హయాంలో కోట్లాది మంది హిందువుల ఆకాంక్షల రూపంగా అయోధ్యలో రామ మందిరం సాకారమైంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. దీంతో దేశవ్యాప్తంగా హిందూ ఓట్‌ బ్యాంక్ అంతా బీజేపీ వైపు పోలరైజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే అయోధ్య అంశం సృష్టించిన హైప్ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టింది. బీజేపీ తరచుగా ఇచ్చే నివాదం సబ్‌ కా సాథ్ … సబ్ కా వికాస్. అయితే ఆచరణలో బీజేపీ అలా నడుచుకోవడం లేదన్న విమర్శలు జోరందుకున్నాయి. భారత సమాజంలో అంతర్భాగమైన ముస్లింలపై ద్వేషం చిమ్మేలా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు అల్పసంఖ్యాకవర్గాలు మరచిపోలేదు. కాంగ్రెస్ సర్కార్‌ వస్తే దేశంలోని యావత్ సంపదను ముస్లిం మైనారిటీలకు దోచుపెడుతుందని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్‌లో దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీని హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు కమలదళం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ముస్లిం ముద్ర కన్పిస్తోందని బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేసింది. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడా ముస్లిం అనే పదమే లేదని కాంగ్రెస్ నాయకులు వివరణ ఇచ్చారు.

పదేళ్లలో ఎన్నో ఘనవిజయాలు సాధించామని జబ్బలు చరుచుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా బీజేపీ శ్రేణుల్లో ఆందోళన పోలేదు. ఈ పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం అనేకసార్లు ప్రజాగ్రహాన్ని చవి చూసింది. మూడేళ్ల కిందట నరేంద్ర మోడీ సర్కార్ ఏకపక్షంగా చేసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల కారణంగా రైతాంగం మహోద్యమమే నడిచింది. ఈ మహోద్యమం ఫలితంగా నరేంద్ర మోడీ సర్కార్ దిగిరావల్సి వచ్చింది. చివరకు నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పి వ్యవసాయ చట్టాల వివాదం నుంచి బయటపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్ ను ఇప్పటివరకు నరేంద్ర మోడీ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో రైతులు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు. పౌరసత్వం సవరణ చట్టంతో కొన్ని వర్గాలను బీజేపీ దూరం చేసుకుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటిన నిత్యావసరవస్తువుల ధరలు, నిరుద్యోగంతో యువతలో నిరాశ నిస్పృహల ప్రభావం ఓటింగ్ లో కనిపిస్తే, బీజేపీకి కష్టకాలమే అంటున్నారు రాజకీయ పరిశీల కులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్