తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ కొత్త స్కెచ్ రెడీ చేసిందా? ఒంటరిగా పోటీ చేస్తే విజయం దక్కదని.. కూటమిని బరిలోకి దించనుందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననక తప్పదు. కొన్నేళ్లుగా ఎన్డీయే కూటమి కేంద్రంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోంది. బీజేపీ రాజకీయ వ్యూహాలకు.. స్థానిక పార్టీల మద్దతు కూడా తోడవడంతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటోంది. ఏపీలో ఎన్డీయే కూటమికి ఎప్పుడూ విజయాలే వరించాయి. 2014, 2024లో కూటమి కారణంగానే టీడీపీ, బీజేపీ అధికారాన్ని షేర్ చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే ఫార్ములా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందట.
2018 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ రాజకీయంగా వెనక్కు తగ్గింది. రాష్ట్రంలో పార్టీని చంద్రబాబు పట్టించుకోవడమే మానేశారు. ఆయన ఫోకస్ మొత్తం ఏపీపై పెట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తెలంగాణపై మరోసారి చంద్రబాబు దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జనసేన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసింది. కానీ ఎక్కడా ప్రభావితం చూపలేక పోయింది. అయితే ఏపీలో పోటీ చేసినట్లే బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన తెలంగాణ బరిలోకి దిగితే మంచి ఫలితాలు సాధించవచ్చని అంచనా వేస్తున్నారట.
ఇటీవల కేంద్ర హోం మంత్రి, బీజేపీ వ్యూహకర్త అమిత్ షా.. చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆ సమయంలో అనేక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆ సమావేశంలో అమిత్ షా, చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. తెలంగాణలో కూడా కూటమి విస్తరణపైనే ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. కేవలం 8 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ మూడో స్థానంలో ఉంది. 2023లోనే తాము అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. కానీ చివరకు ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాగా.. ఇప్పుడు 2028 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసింది. ఒక వేళ జమిలీ ఎన్నికలు వచ్చినా.. తెలంగాణలో మాత్రం పాగా వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోందట. అందుకే పలు రాజకీయ ఎత్తుగడలకు అమిత్ షా తెరలేపినట్లు తెలిసింది.
తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇప్పటికీ టీడీపీ పట్ల సానుకూలంగా ఉంటారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులకు చంద్రబాబు పట్ల అభిమానం ఉంటుంది. మరోవైపు సినీ నటుడిగా పవన్ కల్యాణ్‌కు తెలంగాణ ప్రాంతంలో అపారమైన అభిమానులు ఉన్నారు. పైగా కాపు సామాజిక వర్గం కూడా తెలంగాణలో ప్రభావం చూపగలిగే స్థాయిలోనే ఉంది. అందుకే ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. తప్పకుండా అధికారంలోకి వస్తామని అమిత్ షా అంచనా వేస్తున్నారట.
త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జరుగనున్నాయి. మరో నాలుగైదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మినహాయిస్తే.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల నుంచే కూటమిని బరిలోకి దించితే.. ప్రజల్లో ఎంత ఆదరణ లభిస్తుందనే అంచనా వేయవచ్చని బీజేపీ బావిస్తోందట. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలు అందుకుంటే.. దానిని కంటిన్యూ చేస్తూ 2028 అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎదుక్కోవాలని భావిస్తున్నారట.
తెలంగాణాలో ఎన్డీయే కూటమి విస్తరణకు సంబంధించి ఉండవల్లిలోని బాబు ఇంట్లో అమిత్ షా ప్రస్తావించిన అంశం వెనక భారీ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఢిల్లీలో మరోమారు భేటీ వేసి కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన కోరారని తెలిసింది. చంద్రబాబు, పవన్ బలానికి తోడు బీజేపీ వ్యూహాలు.. అమిత్ షా, మోడీ చరిష్మా తోడు అయితే కచ్చితంగా గెలుపు సాధిస్తామనే ధీమాగా ఉన్నారట. మొత్తానికి ఏపీకి అమిత్ షా రావడం ద్వారా ఎన్డీయే కొత్త బంధానికి బాటలు వేశారని అంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఎన్డీయేను ఏ మాత్రం ఆదరిస్తారో వేచి చూడాలి.