స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి మల్లారెడ్డి తమ భూములను ఆక్రమించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు బాధితులు మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డి. మంత్రి మల్లారెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలోని మంత్రి మల్లారెడ్డి కాలేజ్ ఎదురుగా సుంకరి కుటుంబానికి చెందిన 8 ఎకరాల భూమిలో తాము నాలుగున్నర ఎకరాలు కొనుగోలు చేయగా.. మంత్రి మల్లారెడ్డి తన భార్య పేరు మీద రెండెకరాలు కొనుగోలు చేశారని చెప్పారు. అయితే మల్లారెడ్డి మొత్తం భూమిని కాజేసేందుకు కట్ర చేస్తున్నారని ఆరోపించారు.
తమ భూమిలోకి వెళ్లకుండా మల్లారెడ్డి అనుచరులతో దాడి చేశారని చెప్పారు. మంత్రి బావమరిది శ్రీనివాస్ రెడ్డి, అతని స్నేహితుడు సురేష్ రెడ్డి గన్ తో షూట్ చేస్తామంటూ బెదిరించారని చెప్పారు. 30 కోట్ల భూమిని కాజేసేందుకు మంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భూ రికార్డుల్లో తమ పేరు తొలగించి అక్రమంగా వారి పేరుమీదకు మార్చుకున్నారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమి ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. తమలాగే చాలా మంది బాధితులు మేడ్చల్ జిల్లాలో ఉన్నారని.. కానీ భయపడి ఎవరు ముందుకు రావడం లేదన్నారు.