సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నంకావడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరోపక్క తమ భవిత్యంపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. గెలుపోటములు ఎలా ఉండనున్నాయోననే అన్న గుబులు పట్టుకుంది.
మే 13 న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్‌లో అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు సమయం దగ్గరపడింది. కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్దమైంది. హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు జూన్ 4న జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొత్తం 1200ల సిబ్బందితోపాటు మరో వేయి మంది ఉద్యోగులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనున్నారు. లెక్కింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. సిసిటీవీ కెమెరాలతో పర్యవేక్షించడంతో పాటు మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 13 లోకేషన్లలో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్న ఆయన.. ఓట్ల లెక్కింపుకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో 20 టేబుల్స్, మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని తెలిపారు. యాకుత్పురా అసెంబ్లీ సెగ్మెంట్ లో అత్యధికంగా 24 రౌండ్ల లెక్కింపు ఉండడం తో ఇక్కడ ఆలస్యంగా ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. ఇక కౌంటింగ్ కేంద్రాలలోకి ఎలాంటి వస్తువులు, మొబైల్ ఫోన్లు అనిమతి లేదని స్పష్టం చేశారు ఎన్నికల అధికారులు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవు తుందని అప్పటికే అభ్యర్థులు లేదా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామన్నారు. అయితే, మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగగా, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్‌లను ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు జరుగుతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రొఫెసర్ రామ్ రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఉస్మానియా యూనివర్సిటీ లో జరుగుతుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్‌లను వెస్లీ కాలేజ్ వద్ద లెక్కించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఈవీఎంలను 8 గంటల నుండి లెక్కించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
కౌంటింగ్ సిబ్బందికి జూన్ 4న ఉదయం ఐదున్నర గంటల నుంచి 6 గంటలలోగా అబ్జర్వర్ సమక్షంలో రాండమైజేశన్ చేసి టేబుల్ కేటాయిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక అబ్జర్వ్ ను కేటాయించారని, అబ్జర్వర్ టేబుల్ వద్ద ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు ఉంటారని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ , మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు రొనాల్డ్ రోస్ వీరందరూ కౌంటింగ్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటారని వివరించారు. ఈవీఎంల లెక్కింపు పూర్తి అయిన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా అబ్జర్వర్ సమక్షంలో ఐదు వీవీ ప్యాట్స్ రాండమ్‌గా ఎంపిక చేసి పోలింగ్ స్టేషన్ స్లిప్పులను లెక్కిస్తారని, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని అన్నారు రొనాల్డ్ రోస్. ఇలా మొత్తానికి కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. పకడ్బందీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక రోజుల వ్యవధి నుంచి గంటల సమయంలోకి కౌంటింగ్ టైం చేరుకోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలవగా విజేతలెవరు.?, అధికారం ఎవరిదన్న ఆసక్తి, ఉత్కంఠగా జూన్ 4న విడుదలయ్యే ఫలితాల కోసం జనం ఎదురుచూస్తున్నారు.