తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, 8:30 గంటలకు ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా 525 మంది బరిలో నిలిచారు.దాదాపు 10 వేల మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటి లెక్కింపునకు 19 ప్రదేశాల్లో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. సాయంత్రం 4 గంటల వరకూ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో నాలుగంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2,400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని చెప్పారు. లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లు, సిబ్బంది సెల్ ఫోన్లు వినియోగిం చుకు నేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి లెక్కింపు కేంద్రం వరకూ పటిష్ట భద్రత ఉంటుందని అన్నారు. కేంద్రంలోని ప్రతి చోటూ కవర్ చేసేలా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామ న్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. మద్యం దుకాణాలు బంద్ చేసేలా కఠిన చర్యలు చేపట్టామన్నారు.
అభ్యర్థుల్లో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబతున్నాయి. 10 స్థానాలకు పైగానే ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు, కాంగ్రెస్ నేతలు సైతం కచ్చితంగా 12 స్థానాలకు పైగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.


