మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున కలిశారు. త్వరలో జరగనున్న ANR అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఫొటోలను నాగార్జున తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఏడాది నాకెంతో ప్రత్యేకమైనదని నాగార్జున ట్వీట్ చేశారు. నాన్నగారి శతజయంతి వేడుకలకు చిరంజీవి, అమితాబ్ బచ్చన్ రానున్నారని తెలిపారు. దీంతో ఈ వేడుక మరింత ప్రత్యేకం కానుందని, ఈ శతజయంతి వేడుకను మరుపురానిదిగా చేద్దాం అని పేర్కొన్నారు.
2024కు గాను ఏఎన్నార్ జాతీయ అవార్డును చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున గతంలోనే ప్రకటించారు. అక్టోబరు 28న ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి అవార్డు అందుకోనున్నారు.