మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియడం లేదు. మొన్నటిదాకా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉండగా.. ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. భవిష్యత్తులో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సీఎం కాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తనకు అనుకూలంగా ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంటూ ధారాశివ్ నగరంలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇటీవలే తాను అనుకుంటే ఇప్పుడే సీఎం అవుతానని అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు వెలియడం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.