ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా రచయితలకు శుభవార్త అందించింది. ‘టాలెంట్ హంట్’ పేరుతో రైటర్లను వెతికి పట్టుకునే పనిలో పడింది ఆహా. ఈ టాలెంట్ హంట్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ (బేబీ సినిమా ప్రొడ్యూసర్) ప్రొడక్షన్ కంపెనీ మాస్ మూవీ మేకర్స్, డైరెక్టర్ సాయి రాజేష్‌కి చెందిన అమృత ప్రొడక్షన్స్ కూడా భాగస్వాములయ్యాయి.
కథలో కొత్తదనం,సృజనాత్మకత, క్రియేటివిటీ ఉన్న రైటర్స్‌కు చక్కటి అవకాశం కల్పిస్తోంది. కామెడీ, థ్రిల్లర్,డ్రామా, హారర్,రొమాన్స్,యాక్షన్ జార్నర్‌లో కథను చక్కగా నెరేట్ చేయగల సత్తా ఉన్నవాళ్లకు సదవకాశం కల్పిస్తోంది. దీనిపై ఆహా కంటెంట్ హెడ్ వాసు దేవ్ కొప్పినేని కీలక విషయాలను వెల్లడించారు. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఎప్పుడు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తారని, దేశ నలుమూలల నుంచి టాలెంట్ ఉన్న ఎంతో మంది కళాకారులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారని, ఆ సంఖ్య ఈ మధ్య కాలంలో మరింత పెరిగిందని, దీంతో ఇది ఆహాలో ఒక సంస్కృతిగా మారిందని వాసు చెప్పారు.
‘‘గొప్ప కంటెంట్ క్రియేట్ కావాలంటే దాని వెనుక కళాత్మకమైన, సృజనాత్మకమైన ఆలోచనలు ఉండాలి.. ఆ విషయంలో రచయితల కష్టం అంతా ఇంతా కాదు. అందుకే అలాంటి కొత్త టాలెంటెడ్ రైటర్లను గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలనే ఐడియా నిర్మాత ఎస్‌కేఎన్ గారికి వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన తెలుగు రైటర్ల సత్తా ఏంటో పాన్ ఇండియా మొత్తం తెలుస్తోంది. అందుకే ఇందులో భాగంగా ‘టాలెంట్ హంట్’ అనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌కి మధ్య ఒక వారధిలా ఇది పని చేయబోతుంది. కేవలం గొప్ప రైటర్లను కనిపెట్టడమే దీని ముఖ్య ఉద్దేశం కాదు.. దాంతో పాటు ఆడియన్స్‌ను విపరీతంగా ఆక్టట్టుకునే కథల్ని.. స్టోరీ టెల్లింగ్ విధానాన్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాం. అందుకే సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం కొత్త రైటర్లను వెతుకుతున్నాం’’ అని వాసుదేవ్ చెప్పారు.
ఈ టాలెంట్ హంట్ గురించి నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘‘వేరే భాషల్లో ఉన్నట్లు తెలుగులో కూడా ఎందుకు వెరైటీ స్టోరీలు రావడం లేదు.. అంటూ చాలా మంది నన్ను అడుగుతుంటారు. అలానే రైటర్ కమ్ డైరెక్టర్లుగా ఉన్న ఎంతోమంది ఈ విషయం గురించి నాతో మాట్లాడుతూ రైటర్లకి తగిన గుర్తింపు, మద్దతు, రెమ్యూనరేషన్ లేదంటూ చెబుతుంటారు. ఆ మాటల్లో నుంచే ఈ టాలెంట్ హంట్ పుట్టింది. కొత్త టాలెంట్‌ను గుర్తించేందుకు ఆహా సరైన వేదిక అని నేను బలంగా నమ్ముతున్నా. సరికొత్త కథలు ఇవ్వగలిగే సత్తా మీలో ఉంటే ఈ అవకాశం మీకే.’’ అని అన్నారు.
రైటర్లను గుర్తించడమే కాకుండా వారిలో కొంతమందికి మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ చేపట్టే ప్రాజెక్టుల్లో పని చేసే అవకాశం కూడా ఇవ్వనున్నారు. తద్వారా ఇండస్ట్రీలో ఓ మంచి కెరీర్‌ను నిర్మించుకునేందుకు ఇది యంగ్ రైటర్లకి మంచి అవకాశం కానుంది. ఇక ఈ టాలెంట్ హంట్‌కి ఎవరైనా అప్లై చేయొచ్చని.. ఎలాంటి అనుభంతో సంబంధం లేకుండా కేవలం టాలెంట్ మాత్రమే అర్హతగా చూడబోతున్నట్లు ఆహా టీమ్ చెప్పింది. ఆసక్తి ఉన్నవారు తాము చేసిన ప్రాజెక్టులను పంపించాలని తెలిపారు. అలా వచ్చిన వాటిలో క్రియేటివిటీ , ఒరిజినాలిటీ, సత్తా చూసి సెలక్ట్ చేస్తామంటూ చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నట్లు తెలిపారు.
https://x.com/ahavideoIN/status/1854402164547846160