యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. పాటలకు వస్తున్న అద్భుతమైన స్పందనతో ఎంతో సంతోషంగా ఉన్న నిర్మాతలు తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
‘ఇంట్రడక్షన్ ఆఫ్ రూల్స్ రంజాన్’ పేరుతో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా కోసం ప్రత్యేకంగా నాలుగో పాటని ప్రదర్శించారు. గత మూడు పాటల్లాగే నాలుగో పాట కూడా కట్టిపడేసింది. అలాగే ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ఏ.ఎం. రత్నం చేతుల మీదుగా విడుదల తేదీని వెల్లడించారు.
నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. “కిరణ్ ముందుగా నేను నిర్మాతను అని భావించి కథ వినడానికి వచ్చారట. కానీ కథ విని, బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారట. ఇప్పుడు పాటలు బాలేకపోతే సినిమా మధ్యలో లేచి వెళ్లిపోతున్నారు. అందుకే సంగీతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పాను. నా అనుభవం ప్రకారం ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకి అమ్రిష్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ కథని నమ్మి నిర్మించడానికి ముందు వచ్చిన నిర్మాతలు దివ్యాంగ్, మురళి అభినందనలు. ఈ సినిమా క్రెడిట్ వారికే దక్కుతుంది. వినోదాత్మక సినిమాలకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే ఈ సినిమా చూశాను. కుటుంబమంతా కలిసి చూడగలిగేలా ఉన్న ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
కథానాయకుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “రూల్స్ రంజన్ ప్రయాణం ఏడాది క్రితం మొదలైంది. ఏ.ఎం. రత్నం గారి ద్వారా కృష్ణ గారిని కలిసి ఈ కథ విన్నాను. ఈ కథ వినేటప్పుడు రెండు గంటల పాటు నవ్వుతూనే ఉన్నాను. థియేటర్లలో చూసేటప్పుడు మీరు కూడా అలాగే నవ్వుకుంటారనే నమ్మకం ఉంది. నేను మనో రంజన్ అనే పాత్ర పోషించాను. మనో రంజన్ మనలో ఒకడిలా ఉంటాడు. అందరూ ఈ పాత్రకి కనెక్ట్ అవుతారు. ఇంత మంచి పాటలు ఇచ్చిన అమ్రిష్ గారికి ధన్యవాదాలు. నేపథ్య సంగీతం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏ.ఎం. రత్నం గారి సినిమా చూస్తూ పెరిగాను. ఆయన నిర్మించిన సినిమాల్లో ఖుషి అభిమాన చిత్రం. ఏ.ఎం. రత్నం గారు మా సినిమాని సమర్పించడం గర్వంగా ఉంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన చిత్ర బృందానికి అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు” అన్నారు.
కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ.. “ఈ అవకాశం ఇచ్చిన నా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ‘సమ్మోహనుడా’ పాటకి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాట విజయానికి కారణమైన అమ్రిష్ గారికి, శ్రేయా ఘోషల్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. ‘డీజే టిల్లు’లో రాధిక పాత్ర తర్వాత, ఈ సినిమాలో నేను పోషించిన సనా పాత్ర ప్రేక్షకులను అంతలా మెప్పిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
దర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ.. “నా గత చిత్రం ‘ఆక్సిజన్’ని మంచి సందేశాత్మకంగా చేశాను. ఆ సినిమాకి థియేటర్లలో ఆశించిన ఆదరణ లభించలేదు కానీ.. ఓటీటీలలో, టీవీల్లో చూసి ఎందరో ఫోన్లు చేసి అభినందించారు. అప్పుడు ప్రేక్షకులకు ఓ మంచి వినోదాత్మక చిత్రం అందించాలని నిర్ణయించుకున్నాను. అలా చేసిందే ఈ ‘రూల్స్ రంజన్’. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్లకు వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిది. ఎస్ఆర్ కల్యాణమండపం హిట్ తర్వాత కిరణ్ గారు నాలుగైదు అంగీకరించారు. ఆ విషయం నాకు తెలియక ఆయనను కలవగానే కథ చెప్పేశాను. ఆ తర్వాత కిరణ్ గారు ఫోన్ చేసి.. ప్రస్తుతం నా చేతిలో ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా చేయలేనని చెప్దామని వచ్చాను.. కానీ మీ కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా చేస్తాను అన్నారు. అలా ఈ సినిమా మొదలైంది. ఈ సినిమాని మేము సొంతంగా నిర్మించాలి అనుకున్నాం. అనుకోకుండా ఈ కథ నా స్నేహితులు దివ్యాంగ్, మురళికి వినిపించడం.. వారు పట్టుబట్టి సినిమా నిర్మిస్తామని ముందుకు రావడం జరిగిపోయాయి” అన్నారు.
నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి మాట్లాడుతూ.. “ఏ.ఎం. రత్నం గారి ద్వారా ఏడాది క్రితం ఈ కథ మా దగ్గరకు వచ్చింది. ఆయన ఆశీస్సులతోనే మేము ముందడుగు వేశాం. కృష్ణ చెప్పిన కథ మాకు ఎంతగానో నచ్చింది. అప్పుడే బ్లాక్ బస్టర్ ని అందిస్తానని నమ్మకం కలిగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ చిత్రాన్ని ఎంతో అందంగా మలిచారు.” అన్నారు.
సంగీత దర్శకుడు అమ్రిష్ గణేష్ మాట్లాడుతూ.. “చెన్నైలో ఉన్నా మేము తెలుగే మాట్లాడతాం. నేను తెలుగు అబ్బాయినే. పాటలకు ఇంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. తెలుగువారు ఎంతలా ప్రేమను పంచుతారో ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఏ.ఎం. రత్నం గారికి, నిర్మాతలు దివ్యాంగ్ గారికి, మురళి గారికి, దర్శకుడు రత్నం కృష్ణ గారికి, కిరణ్ గారికి, నేహా శెట్టి గారికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా వారికి నా కృతఙ్ఞతలు. నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా ఇంట్లో కిరణ్ గారి సినిమాలు చూస్తుంటాం. ఇప్పుడు ఆయన సినిమాకి పని చేయడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
భావోద్వేగాలు, ప్రేమ, హాస్యం, అద్భుతమైన సంగీతం కలగలిసిన విందుభోజనం లాంటి ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.
వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే సహా పలువురు హిందీ నటులు కూడా రూల్స్ రంజన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దులీప్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ గా ఎం. సుధీర్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్