ఆదిలాబాద్ ఇలాఖాలో మరోసారి కమలం సత్తా చాటింది. వరుసగా రెండోసారి కాషాయం జెండాను రెపరెపలాడించింది. బీఆర్‌ఎస్ నుంచి చివరి నిమిషంలో బీజేపీలోకి జంప్ అయిన గోడం నగేష్‌ను విజయం వరించింది. 90 వేల మెజార్టీతో గెలిచి ప్రత్యర్థులకు ఓటమి రుచి చూపించారు.
ఆదిలాబాద్ గడ్డపై మరోసారి కాషాయ జెండా రెపరెపలాడింది. సిట్టింగ్ సీటును పదిలంగా కాపాడుకుని బీజేపీ సత్తా చాటింది. బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న గోడెం నగేష్.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఓడించి విజయఢంకా మోగించారు. 90 వేల 652 ఓట్ల మెజారితో ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై గెలుపు సాధించారు. కారు, హస్తం ఎన్ని ఎత్తులు వేసినా అంతకుపై ఎత్తులు వేసి విజయకేతనం ఎగురువేశారు. రాజకీయ శక్తిగా ఎదిగిన బీఆర్‌ఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించారు. అంతేకాదు.. అధికారం చేజిక్కించుకుని ఫుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ను సైతం ఓడించారు.
రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. ఆదిలాబాద్‌లోనూ బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా సాగింది. అయితే,.. బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ గెలుపుతో బీఆర్‌ఎస్ తరపున బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఒక్క ఆసిఫాబాద్ నియోజక వర్గం మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ సత్తా చాటింది. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్న నిర్మల్ ముధోల్ నియోజకవర్గంలో 81 వేల 683 ఓట్ల ఆదిక్యతతో నగేష్ విజయం ఖరారైంది. కాగా,.. 2019 పార్లమెంటు ఎన్నికల్లో అప్పటి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుకు 58 వేల 227 ఓట్ల మెజార్టీ రాగా.. ఇప్పుడు నగేష్‌కు అంతకంటే ఎక్కువ మెజార్టీని సాధించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ 73 వేల 931 ఓట్లు సాధించగా.. బీజేపీ 47 వేల 56 ఓట్లు సాధించింది.
దీంతో కాంగ్రెస్ 26 వేల 940 ఓట్ల ఆదిక్యత ప్రదర్శించింది. అలాగే నగేష్ సొంత నియోజకవర్గమైన బోథ్‌లో బీజేపీ కేవలం 4 వేల 914 ఓట్లతో కాంగ్రెస్ పై స్వల్ప ఆధిక్యతను మాత్రమే సాధించడం గమనార్హం. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాతినిథ్యం వహించిన ఆదిలాబాద్ నియోజకవర్గంలోనూ గోడెం నగేష్ ఆత్రం సుగుణపై కవలం 5 వేల 338 ఓట్లు సాధించారు. అయితే,.. మరో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రాతినిథ్యం వహించే సిర్పూర్ T లో నగేష్‌కు 8 వేల 369 ఓట్ల ఆదిక్యం రావడం విశేషం. ఇలా లెక్కలు చూసుకుంటే విజయదుందుబి మోగించడంలో నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ఆధిక్యతనే ప్రధాన కారణమని చెప్పవచ్చు.
ఇకపోతే ఆదిలాబాద్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఒక్క ఆసిఫాబాద్ మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో అనుకున్న రీతిలో ఓట్లను సాధించలేకపోవడంతో గెలుపు చేజారింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లోకసభ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించినా.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేసినా మళ్లీ ఓటమి రుచే చూపించారు ఆదిలాబాద్ వాసులు. అయితే,.. చివరి నిమిషంలో నేతల మధ్య సమన్వయ లోపం, కొంతమంది ఏకపక్ష వైఖరి పార్టీకి నష్టం చేకూర్చిందని.. మంత్రి సీతక్క ఇన్చార్జిగా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఓటమి తప్పలేదన్న విమర్శ వినిపిస్తోంది.
ఈ కారణాల వల్లే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహించే ఖానాపూర్‌లోనూ బీజేపీ 13 వేల 519 ఓట్లు సాధించిందంటున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రాతినిథ్యం వహించే బోత్, బీజేపీ ఇలాఖా అయిన సిర్పూర్‌లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడినా.. నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఆశించిన రీతిలో పట్టు సాధించలేకపోయింది. అయితే శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుంటే 47 వేల 1516 ఓట్లు సాధించి అనూహ్యంగా పుంజుకొని రెండో స్థానానికి చేరింది. బీఆర్‌ఎస్ మాత్రం గతసారి కంటే డీలాపడింది. 2019 ఎన్నికల్లో 31 వేల 865 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచిన గులాబీ.. ఇప్పుడు మాత్రం లక్షా 37 వేల 217 ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమైంది.


