31.7 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

అన్నదాతల చిరునవ్వుకు చిరునామా …. మోతుగూడెం జలవిద్యుత్

    ఏపీ ప్రజల వర ప్రదాయినిగా అల్లూరి జిల్లా మన్యం మణిహారంగా విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులను తిరగ రాస్తోంది మోతుగూడెం ఏపీ జెన్కో జల విద్యుత్‌ కేంద్రం. కరెంట్‌ కొరత తీర్చడమే కాదు.. అన్నదాతలకు సాగు నీరందిస్తూ వారి ముఖంలో చిరునవ్వులను చిందిస్తోంది. వెలుగు జిలుగులతో ఉత్తరాంధ్ర ప్రతిష్టను దేశం నలు మూలల చాటుతూ.. ఒకటి రెండు కాదు,.. 48 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకోసం మోతుగూడెం జల విద్యుత్‌పై ప్రత్యేక కథనం.

జల విద్యుత్‌ ఉత్పత్తికి వరంగా మారింది సీలేరు ప్రాజెక్టు. ఏపీలో కరెంట్‌ కొరతను అధిగమించేందుకు ఈ నదిపై నాలుగు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. అనంతగిరి కొండల్లో పుట్టి మాచ్‌ఖండ్‌ మీదుగా ప్రవహిస్తూ.. ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులను తాకుతూ 320 కిలో మీటర్ల మేర ప్రవహిస్తోంది సీలేరు నది. అయితే,.. సీలేరు ప్రవాహం ఎంతో వేగంగా ఉండటంతో ఈ నదిపై మాచ్‌ఖండ్‌, ఎగువ సీలేరు, డొంకరాయి, దిగువ సీలేరు ప్రాంతాల్లో జల విద్యుత్‌ కేంద్రాలను నిర్మించారు.

సీలేరు విద్యుత్ కేంద్రాలలో ఒకటైన మోతుగూడెం విద్యుత్‌ కేంద్రం.. థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పోటీ పడుతూ.. కరెంట్‌ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ ప్రాజెక్టును 1976 మార్చి 28న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయితే,.. ఈ విద్యుత్‌ కేంద్రంలోని ఒకటి రెండు యూనిట్లను రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో 1976లో నిర్మాణం చేయగా.. ఆ తర్వాత 1977-78లో 3, 4 యూనిట్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో BHEL సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టారు. ఈ నాలుగు యూనిట్లలో ఒక్కో యూనిట్ నుంచి 115 మెగావాట్ల చొప్పున 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ నుంచి 4 ఫీడర్స్ ద్వారా ఏపీ పవర్ గ్రిడ్‌కు.. అక్కడినుంచి 33 కె.వి, 11 కె.వి లైన్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ గ్రిడ్లకు విద్యుత్ సరఫరా అవుతోంది.

   ఈ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలోనే అదనంగా 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం.. ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణానికి అప్పట్లోనే అన్ని టన్నల్ పనులు పూర్తి చేసి ఆపేశారు. మళ్లీ 48 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఈ రెండు యూనిట్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించిడం తో..హైదరాబాద్‌కు చెందిన షిరిడి సాయి ఇంజనీరింగ్ కంపెనీ సుమారు 430 కోట్ల వ్యయంతో టెండర్‌ను దక్కించుకొని పనులు ప్రారంభించింది. పోల్లూరు వద్ద ఈ 5,6 యూనిట్లకు సంబంధించి పెన్ స్టాక్ పైప్ లైన్ పనులు గత ఏడాది నుండి శర వేగంగా జరుగుతున్నాయి. విశేషమేమిటంటే అప్పట్లో ఈ నాలుగు యూనిట్లకు పెన్ స్టాక్ పైప్ లైన్ నిర్మించిన పెస్‌ కంపెనీయే ప్రస్తుతం జరుగుతున్న 5, 6 యూనిట్ల పనలను చేపడుతోంది.

సీలేరు నది కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాదు.. వ్యవసాయం రంగానికి తోడ్పాటునిస్తోంది. 16 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఉభయగోదావరి జిల్లాల్లో రబీ పంటకు సాగునీరును అందిస్తోంది. సుమారు పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న నీటి పారుదలశాఖ ఆదేశాల మేరకు సీలేరు నది నుంచి ఏటా 10 టీఎంసీల నుంచి 27 టీఎంసీల వరకు సాగు నీటిని అందిస్తున్నారు. సీలేరు కాంప్లెక్స్‌ పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. అంతే కాదు చిత్ర రంగానికి కూడా ఈ ప్రాజెక్టు ప్రత్యేకం. ఈ ప్రదేశంలో అనేక చిత్రాల షూటింగ్‌లు జరిగాయి. పాన్‌ ఇండియా మూవీగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన పుష్ప 1 ఈ ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకుంది. అలాగే పుష్ప 2 సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను కూడా ఇక్కడ చిత్రీకరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్