నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలు, నటి అదితిరావు హైదరీని వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు, అతి తక్కువ మంది బంధువులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారని.. సినీ ప్రముఖుల కోసం త్వరలోనే విందు ఏర్పాటుచేయనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ వివాహానికి సంబంధించి సిద్దార్థ్, అదితిల నుంచి ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహా సముద్రం’ కోసం సిద్ధార్థ్, అదితి తొలిసారి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా షూట్‌లోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. ‘మహాసముద్రం’ తర్వాత కలిసి ఫంక్షన్స్, పార్టీలకు హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదని.. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. తాజాగా పెళ్లిపై వార్తలు రావడంతో సిద్ధార్థ్ అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితిరావు ఒకరు. అందుకే ఆమె ఆ సంస్థానానికి చెందిన దేవాలయంలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సిద్దార్థ్, అదితిరావు హైదరి.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. 2003లో మేఘన అనే అమ్మాయిని సిద్ధార్థ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో.. 2007లో విడిపోయారు. ఆ తర్వాత సిద్ధార్థ్ విషయంలో మళ్లీ పెళ్లి అంటూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు అదితిరావు హైదరిని ఇలా రహస్యంగా వివాహం చేసుకుని.. మళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అదితి రావు కూడా 2002లో లాయర్, యాక్టర్ అయిన సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుని.. ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకుంది.


