స్వతంత్ర వెబ్ డెస్క్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నోటీసు జారీ చేసింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తోన్న ఆందోళనపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ స్పందించింది. దేశరాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేయడాన్ని, అలాగే. వారిని నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే సస్పెన్షన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
గత కొద్దినెలలుగా రెజ్లర్ల చేస్తోన్న ఆందోళనను మేం గమనిస్తున్నాం. ఈ నిరసనల ప్రారంభ రోజుల్లోనే భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని ఆయన బాధ్యతల నుంచి పక్కన పెట్టిన విషయం మా దృష్టిలో ఉంది. ఆయన ప్రస్తుతం సమాఖ్య ఇంఛార్జ్ కాదు. రెజ్లర్ల భద్రత, నిష్పాక్షిత దర్యాప్తు నిర్ధారించేందుకు మరోసారి సమావేశం నిర్వహించనున్నాం’అని యూడబ్ల్యూడబ్ల్యూ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
మంగళవారం రెజ్లర్లు తీవ్ర నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లైంగిక ఆరోపణలు, బ్రిజ్ భూషణ్‌పై చర్యల విషయంలో కేంద్రం స్పందించనందుకు నిరసనగా పతకాలను గంగలో కలిపేందుకు హరిద్వార్ చేరుకున్నారు. హర్ కీ పౌఢీ వద్ద సుమారు 20 నిమిషాలపాటు పాటు మౌన దీక్ష చేశారు. ఆ తర్వాత గంగా నది ఒడ్డుకు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. ప్రాణ సమానమైన పతకాలను నిమజ్జనం చేయాల్సి వస్తోందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఈ స్థితికి తీసుకొచ్చిన నేతలపై విమర్శలు గుప్పించారు. వారి రోదనలతో అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది. అయితే, చివరి క్షణంలో ఖాప్, రైతు సంఘాల నేతలు వారిని వారించారు. కేంద్ర ప్రభుత్వానికి కొంత గడువిద్దామని ప్రతిపాదించారు. దాంతో ప్రభుత్వానికి ఐదు రోజుల గడువిస్తున్నామని, అప్పటిలోగా చర్యలు తీసుకోకుంటే పతకాలు గంగలో కలిపేస్తామని స్పష్టం చేశారు.