ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్‌లో పరీక్షలు తొలగిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఈ సందర్బంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు తీసుకుంటామని వెల్లడించారు.
చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని.. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నామని ఈ సందర్భంగాఆ కృతికా శుక్లా చెప్పారు. సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. 2024-25 నుంచి పదో తరగతిలో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారని… 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతామన్నారు. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో పోటీ పడటం సులభమవుతుందని వివరించారు.
15 రాష్ట్రాల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్‌లో ప్రవేశపెట్టారని కృతికా శుక్లా తెలిపారు. సిలబస్ సంస్కరణ, నూతన సబ్జెక్ట్ కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నామని వివరించారు. పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తెస్తామన్న ఆమె… ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయని వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలని కృతికా శుక్లా తెలిపారు.