స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీహార్ జైలులో ఉన్న ఆయన ఇవాళ ఉదయం బాత్రూంలో స్పృహతప్పి పడిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన వెన్నెముకకు గాయమైందని శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉందని జైలు అధికారులు తెలిపారు. జైలులో ఉంటున్న జైన్ బలహీనంగా బక్కచిక్కిపోయారు. ఇటీవల కూడా ఆయన ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకున్నారు.
కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్న జైన్ పలుమార్లు బెయిల్‌కు ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానాలు అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ జైల్లో ఉన్న సమయంలో జైన్ 35 కిలోల బరువు తగ్గారని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం అత్యవసర విచారణ కోసం వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించాలని ఆదేశించింది.